ఫిబ్రవరిలో యాదాద్రి ఆలయం ప్రారంభం 

యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తికావచ్చాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. చినజీయర్‌ స్వామి సంకల్పం మేరకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆలయ ప్రారంభం ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా 1008 కుండాలతో మహా సుదర్శనయాగం చేయాలని సంకల్పించినట్టు చెప్పారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా వైష్ణవ పీఠాలన్నింటి నుంచి స్వాములను పిలిపించాలని జీయర్‌స్వామిని వేడుకొన్నానని, దీనికి ఆయన ఒప్పుకొన్నారని తెలిపారు. 

దేశంలోని పలు ప్రాంతాల్లోని పండితులను యాదాద్రిలో జరిగే మహా సుదర్శనయాగానికి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ‘చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో విశేష యాగాన్ని తలపెట్టాం. ఆలయసేవలకు భంగం కలుగకుండా మీకు రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటుచేస్తాం. మీరు రోజు వచ్చి మా కార్యక్రమంలో పాల్గొనాలి’ అని కోరితే శ్రీరంగం పండితులు సంతోషపడ్డారని చెప్పారు. యాదాద్రి పునర్నిర్మాణంపై జీయర్‌స్వామి సలహాలు అపారమైనవని చెప్పారు. 

కాగా, యాదగిరిగుట్ట  దేవస్థానాన్ని కాంతులీనే యాదాద్రిగా.. దేశంలోని నర్సింహస్వామి క్షేత్రాల్లోæకెల్లా తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి కొనియాడారు. యాదాద్రిని ఉత్తమ క్షేత్రంగా తయారు చేయడానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు కృషి చేయడం అభినందనీయమన్నారు.