పోలీస్ స్టేషన్ లో కోడెల తనయుడి వీరంగం

రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి, గతంలో ప్రాతినిధ్యం వహించిన నరసరావుపేట నియోజకవర్గాలలో `రాజ్యాంగేతర శక్తీ’గా వ్యవహరిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ, ఆ రెండు నియోజకవర్గాలకు తానే శాసన సభ్యుడినిన్నట్లు అధికార యంత్రాంగంపై ఆధిపత్యం వహిస్తున్న కోడెల కుమారుడు శివరామకృష్ణ చెప్పిందే వేదంగా అక్కడ ప్రభుత్వ అధికారులు కుడా వ్యవహరిస్తున్నారు.

తమ వర్గానికి చెందినా ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళడంతో సహనం కోల్పోయారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీస్ అధికారులపై వీరంగం సృష్టించారు. తమ వర్గీయులను విడిచిపెట్టాలంటూ పోలీసుస్టేషన్‌లో హడావుడి చేశారు. “మీకెంత ధైర్యం ఉంటే మా మనిషిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొస్తారు” అంటూ పోలీసులపై దూషణలకు దిగారు. ఈ సంఘటన గుంటూరు జిల్లాల్లో రాజకీయ దుమారం రేపుతున్నది.

రొంపిచర్ల మండలంలోని ఎడ్వర్డుపేటలో సోమవారం రాత్రి వినాయకుని నిమజ్జనం సందర్భంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై జరిగిన దాడి విషయంలో ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్‌ కొలికొండ కొండలును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న మండల టీడీపీ నాయకులు మంగళవారం సాయంత్రం స్టేషన్‌కు చేరుకుని తమ నాయకుడిని వెంటనే విడుదల చేయాలంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదే సమయంలో నరసరావుపేట నుంచి స్పీకర్‌ కోడెల తనయుడు శివరామకృష్ణ రొంపిచర్ల పోలీసుస్టేషన్‌కు వస్తూనే పోలీసులపై విరుచుకుపడ్డారు. డీఎస్పీ కె. నాగేశ్వరరావు కూడా అప్పుడే వచ్చారు. శివరామకృష్ణకు డీఎస్పీ మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులపై శివరామకృష్ణ గొడవకు దిగడంతో మండల టీడీపీ నేతలు మరింతగా రెచ్చిపోయి పోలీసులను తిడుతూ దౌర్జన్యం చేశారు.

దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదే సమయంలో టీడీపీ నేతల దౌర్జన్యాన్ని వీడియో తీస్తున్న ఓ కానిస్టేబుల్‌ను కోడెల శివరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కెమెరాను లాక్కునే ప్రయత్నం చేశారు. అరెస్టయిన వ్యక్తిని తన వెంట పంపాల్సిందేనంటూ శివరామకృష్ణ పట్టుబట్టారు.

ఒక దశలో టీడీపీ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో డీఎస్పీ నాగేశ్వరరావు శివరామకృష్ణతో చర్చలు జరపగా రెండు గంటల అనంతరం ఆయన అక్కడి నుంచి తిరిగి వెళ్లారు. కొలికొండ కొండలును వదిలేస్తామని హామీ ఇచ్చిన మేరకే కోడెల శివరామకృష్ణ స్టేషన్‌ నుంచి వెళ్లినట్లు తెలుస్తున్నది.