27న బీజేపీ తెలంగాణా మహిళా సమ్మేళనం

ఈ నెల 27న బీజేపీ మహిళా సమ్మేళనం నిర్వహించనున్నట్లు బిజెపి తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ తెలిపారు.  బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాదాపు 20 వేల మంది మహిళలతో సిద్దిపేట జిల్లాలోని చేగుంట లోగాని రంగారెడ్డి జిల్లాలోగాని సమావేశం నిర్వహిం చనున్నట్లు వెల్లడించారు. ఈ సమ్మేళనానికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ హాజరవుతారని చెప్పారు.

ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయడం ద్వారా రాస్త్రంలో మహిళలు బీజేపీ వెంట ఉన్నారని చూపించాలని కోరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సూచన మేరకు మహిళా సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు.

టీఆర్‌ఎస్‌ ఉద్యమ పార్టీ అని నమ్మి ఓట్లేస్తే, కారణం లేకుండా అసెంబ్లీని తొమ్మిది నెలల ముందే రద్దు చేశారని విమరించారు. ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడుగనన్న కేసీఆర్‌ అది ఇప్పట్లో అమలు చేయలేరు కాబట్టే ముందస్తుకు వెళ్లారని ఎద్దేవా చేసారు.  డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల శాంపిల్స్‌ మాత్రమే నిర్మించారని చెబుతూ హామీ ఇచ్చిన విధంగా రెండు లక్షల ఇళ్లు ఎక్కడా కట్టారని అడిగారు.

కాంగ్రెస్‌ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతి జరిగిందని, విచారణ జరిపిస్తామన్న కేసీఆర్‌ ఎందుకు మిన్నకుండిపోయారని ప్రశ్నించారు. లోపాయకారిగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ ఒప్పందం చేసుకొని, ఇద్దరూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారే తప్ప విచారణ సాగడంలేదని డా. లక్ష్మణ్ ఆరోపించారు.

ప్రధాని మోదీ ఇచ్చిన ‘ప్రధాని ఆవాస్‌ యోజన’ నిధులు దారి మళ్లించారని బిజెపి నేత ఆరోపించారు. ఆయుష్మాన్‌ భారత్‌ లాంటి పథకం వల్ల మోదీకి పేరు వస్తుందన్న అక్కసుతోనే కేసీఆర్‌ రాష్ట్రంలో అమలు చేయడం లేదని దయ్యబట్టారు. పరీక్షల్లో పుస్తెలు, మెట్టెలు తీయించి హిందూ సంçస్కృతిని అవమానించడంపట్ల మహిళాలోకం ఆగ్రహంతో ఉందని లక్ష్మణ్ చెప్పారు. ధర్నాచౌక్‌ విషయంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు అని అన్నారు.

కాగా, ఎన్నికల్లో మహిళలకు అధిక సీట్లు కేటాయించాలని బిజెపి అధ్యక్షుడిని మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ కోరారు.