ఎస్‌బీఐ నష్టం రూ.4,876 కోట్లు

బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) భారీ నష్టాలను మూటగట్టుకున్నది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.4,876 కోట్ల నష్టం వచ్చినట్లు బ్యాంక్ ప్రకటించింది. సిబ్బంది వేతనాలు పెరుగడం, ట్రెజరీ నష్టాలు అధికమవడం వల్లనే లాభాల్లో భారీ గండిపడిందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ ఆస్తుల నాణ్యత ప్రమాణాలు పెరుగడం విశేషం.

ఈ ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో లాభాల్లోకి రావడం ఖాయమని బ్యాంక్ చైర్మన్ రాజ్‌నీష్ కుమార్ స్పష్టంచేశారు. సెప్టెంబర్ త్రైమాసికం నుంచి ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో మెరుగుపడనున్నదన్న ఆయన..2016-17 ఏడాది ఇదే కాలానికి బ్యాంక్ రూ.2,006 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు చెప్పారు.

సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.62,911 కోట్ల నుంచి రూ.65,492.67 కోట్లకు పెరిగినట్లు ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పేర్కొన్నారు. గతేడాది జూన్‌లో 9.97 శాతంగా ఉన్న బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ ఈ సారికిగాను 10.69 శాతానికి పెరిగినట్లు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.

విలువ పరంగా చూస్తే ఇది రూ.2,23,427 కోట్ల నుంచి రూ.2,12,840 కోట్లకు తగ్గాయి. వీటితోపాటు నికర నిరర్థక ఆస్తుల విలువ తగ్గడం ఊరటనిచ్చే అంశం. 5.97 శాతం(రూ.1,10,855 కోట్లు) నుంచి 5.29 శాతానికి (రూ.99,236 కోట్లు) తగ్గినట్టు ఆయన పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న జెట్ ఎయిర్‌వేస్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.