టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి వంశీ రాజీనామా  

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా వంశీ రాజీనామా చేసి వైసీపీ లేదా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. 

ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు తన రాజీనామా లేఖను వంశీ పంపారు. అంతేకాదు.. రాజకీయాలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు బాబుకు రాసిన లేఖలో నిశితంగా వివరించారు.  

ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు రెండు సార్లు అవకాశం కల్పించిన చంద్రబాబుకు ఆ లేఖలో కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను టీడీపీ హయాంలో ఎక్కువగా నెరవేర్చానని, నియోజకవర్గ అభివృద్ధిలో కూడా పాల్గొన్నానని చెప్పుకొచ్చారు. అయితే గత ఎన్నికల్లో అతికష్టం మీద గెలవాల్సి వచ్చిందని, స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు, కొందరు ఉద్యోగులు నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారని ఆరోపించారు. 

అయినప్పటికీ తాను ఎన్నికల్లో గెలుపొందినా,  ఎన్నికల తర్వాత అనేక సమస్యలు నన్ను చుట్టుముట్టాయని, రాజకీయంగా తనను వేధిస్తున్నారని, తన అనుచరులపై కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. అనుచరులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే తాను రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని వల్లభనేని వంశీ ఆ లేఖలో రాసుకొచ్చారు. 

ఈ కారణాలతోనే  శాసనసభ సభ్యత్వానికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వంశీ చెప్పుకొచ్చారు.