జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి 

ప్రతి ఏడాది మాదిరిగానే ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి కూడా సరిహద్దుల్లోని భద్రతా బలగాలతో కలిసి దీపావళి వేడుకలు చేసుకోనున్నారు. ఈసారి కశ్మీర్‌‌లోని సరిహద్దు ప్రాంతాల్లో జవాన్లతో ఆయన దీపావళి పండుగ చేసుకుంటారు. అయితే ఇతమిత్ధమైన లొకేషన్‌ ఇంకా వెల్లడి కాలేదు. రెండ్రోజుల క్రితమే ప్రధాని వీర జవాన్లందరికీ దీపావళి శుక్షాకాంక్షలు తెలిపారు.

'ఇవాళ మనమంతా కుటంబ సభ్యులందరితో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటాం. ఇదే సమయంలో మన కోసం, దేశం కోసం సరిహద్దుల్లో నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్న జవాన్లకు శుభాకాంక్షలు తెలపడం మన విధి. వారందరికీ నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను' అని మోదీ ఆ సందేశంలో పేర్కొన్నారు. 

2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ ఆ ఏడాది దీపావళిని సియాచిన్‌ వద్ద ఆర్మీ జవాన్లతో జరుపుకొన్నారు. ఆ తర్వాత ఏడాది పంజాబ్ సరిహద్దుల్లో పర్యటించి జవాన్లతో కలిసి వేడుకలో పాల్గొన్నారు. 2016లో హిమాచల్ ప్రదేశ్ వెళ్లి ఇండో-టిబిటెన్ సరిహద్దు పోలీసులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకొన్నారు. నాలుగో దీపావళిని 2017లో జమ్మూకశ్మీర్‌లోని గురెజ్‌లో సరిహద్దు జవాన్లతో కలిసి చేసుకున్నారు.