చంద్రబాబుపై కోర్టు ధిక్కార పిటిషన్‌

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మహారాష్ట్ర న్యాయస్థానంలో ‘కోర్టు ధిక్కార’ పిటిషన్‌ దాఖలు చేస్తున్నట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. బాబ్లీ వ్యవహారంలో న్యాయవ్యవస్థను కించపరిచేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారని ఆయన ఆరోపించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఈ పిటిషన్‌ సిద్ధమవుతోందని చెప్పారు.

విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోర్టులపై చంద్రబాబు, టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను న్యాయ నిపుణులకు చూపించామని తెలిపారు. అలాగే ఏపీ అసెంబ్లీలో కుడా ముఖ్యమంత్రిపై సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెడతామని జీవీఎల్‌ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆయన చెప్పారు. ఇటు హక్కుల తీర్మానం, అటు కోర్టు ధిక్కార పిటిషన్‌తో చంద్రబాబును ఇరుకున పెడతామని స్పష్టం చేసారు.

కాగా, బాబ్లీ జల వివాదానికి సంబంధించి కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేస్తే న్యాయస్థానాన్ని మోదీ ప్రభావితం చేశారని చంద్రబాబు మాట్లాడడం దారుణమని బిజెపి ష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాష్ట్రంలోని న్యాయస్థానాలు పలు కేసుల్లో వారెంట్లు జారీ చేస్తే వాటిని సీఎం చంద్రబాబు ప్రభావితం చేసినట్టేనా అని ప్రశ్నించారు.

రాజ్యాంగ వ్యవస్థలను ప్రభావితం చేశామనే చంద్రబాబు వ్యాఖ్యలపై ముంబయి న్యాయస్థానంలో కోర్టు ధిక్కారం కింద పిటిషన్‌ వేయనున్నట్లు తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం న్యాయవ్యవస్థను కించపరిచేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని దయ్యబట్టారు. అవినీతిని, అసమర్ధతను కప్పిపుచ్చుకొనేందుకే ప్రధాని మోదీపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని కన్నా మండిపడ్డారు.