హుజుర్ నగర్ ప్రజలకు ప్రతిఫలం దక్కాలి

హుజుర్ నగర్ కు ఈఎస్ఐ అస్పత్రి మంజూరు కోసం కృషి చేస్తానని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. శనివారం హుజుర్ నగర్ లో నిర్వహించిన ప్రజా కృతజ్ఞత సభలో సిఎం పాల్గొంటూ ఉపఎన్నికల్లో ఘన విజయాన్ని అందించిన హుజుర్ నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. హుజుర్ నగర్ మున్సిపాలిటికీ సిఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.

నీలేవో, పాలేవో తెలుసుకుని గెలిపించారని, ఈ విజయం తమలో ఉత్సాహాన్ని పెంచిందని తెలిపారు. "మీరందించిన విజయానికి ప్రతిఫలం దక్కాలి" అని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో తాను కరువు మంత్రిగా ఉన్నప్పుడు ఏ సమస్యలైతే ఉన్నాయో… అవి ఇప్పటికీ ఉన్నాయని పేర్కొంటూ హుజుర్ నగర్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. 

హుజుర్ నగర్ లోని ప్రతి మండల కేంద్రానికి రూ.30 లక్షలు మంజూరు చేస్తామని సిఎం ప్రకటించారు. తెలంగాణలో ఏ మూల అయినా తనదేనని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఎక్కడ నీళ్లు రాకపోయినా ఆ బాధ్యత తనదేనన్నారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ముందుకెళ్తున్నానని తెలిపారు. 

‘గోదావరి నీళ్లు నాగార్జునసాగర్‌ లెఫ్ట్‌ కెనాల్‌కు రావాలి. వచ్చే బడ్జెట్‌లో నియోజకవర్గానికి నిధులు మంజూరు చేస్తాం. అవసరమైన లిఫ్ట్‌లు, కాలువలు నిర్మిస్తాం’ అని ఈ సందర్భంగా సీఎం భరోసా ఇచ్చారు.