పోలవరం అసలు కాంట్రాక్టర్ చంద్రబాబే

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అసలు కాంట్రాక్టర్ చంద్రబాబేనని, ఆయనే సబ్‌కాంట్రాక్టర్లకు పనులు పంచుకుని కేంద్రం మంజూరు చేసిన నిధులు తమవిగా చెప్పుకుంటూ ప్రజలను మోసంచేస్తున్నారని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.

తెనాలి పట్టణంలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో  మాట్లాడుతూ విభజన చట్టం లో పేర్కొన్న ప్రకారం ప్రత్యేక హోదా కింద రాష్ట్రానికి రూ 5వేల కోట్లు మాత్రమే వస్తాయని, ప్రత్యేక ప్యాకేజీ కింద రూ16500 కోట్లు ఇస్తామని నాడు బీజెపీ ప్రభుత్వం చెప్పిందని,  ఆప్రకారంగానే 10 సంవత్సరాలలో చేయాల్సిన అభివృద్ధిని అనతికాలంలోనే చేస్తూవస్తోందని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం 90శాతం, రాష్ట్రం 10శాతం ఖర్చు చేయాల్సియున్నప్పటికీ కేంద్రమే పూర్తిగా భరిస్తూ ప్రజాసంక్షేమం కోరి నిధులు మంజూరుచేసి అప్పగిస్తుంటే అవన్నీ తామే చేసినట్లు, కేంద్రంతో ఎటువంటి సంబంధం లేనట్లు అబద్ధపు ప్రచారాలు చేస్తూ మిత్రద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలిచారని విమర్శించారు.

2019 ఎన్నికలలో తాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల నుండి పోటీ చేస్తామని కన్నా స్పష్టం చేశారు. మీడియా నిర్వాహకులు ఓమారు ఆత్మపరిశీలన చేసుకొని ఏది సత్యమో, ఏది అబద్ధమో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు.