గాంధీ – మోడీ చిత్రానికి రూ.25 లక్షలు

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వచ్చిన జ్ఞాపికల ఇ వేలం శుక్రవారం ముగిసింది. వేలం వేసిన వస్తువుల్లో మోడీ మహాత్మాగాంధీతో ఉన్నట్టు వేసిన ఒక పెయింటింగ్ రూ.25 లక్షలు పలికింది. అలాగే మోడీ తన తల్లి ఆశీస్సులు పొందుతున్న ఒక ఫోటోకు రూ1000 ధర నిర్ణయించగా, వేలంలో అది రూ.20 లక్షలకు అమ్ముడయింది. 

చెక్కతో అందంగా చేసిన కమలంపై విఘ్నేశ్వరుడు కూర్చుని ఉన్న జ్ఞాపికతో మొదలుకుని రకరకాల ఆకృతుల్లో ఉన్న జ్ఞాపికలు వేలంలో ఖరీదు చేశారు. మణిపురి జానపద నృత్యానికి సంబంధించిన జ్ఞాపిక అసలు ఖరీదు రూ.50 వేలు కాగా ఈ-వేలంలో రూ.10 లక్షలకు విక్రయమైంది.   

ఇ వేలంలో వచ్చిన సొమ్మును నమామి గంగామిషన్ నిధికి విరాళంగా ఇస్తారు. ప్రధానికి వచ్చిన మొత్తం 2,772 మెమొంటోల్ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ సెప్టెంబర్ 1 నుంచి వేలం వేయడం ప్రారంభించింది. వేయవేసే వస్తువుల్ని న్యూఢిల్లీలోని ‘నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్’ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచింది.

ఈ జ్ఞాపికల్లో పెయింటింగ్స్, శిల్పాలు, శాలువలు, జాకెట్లు, సంప్రదాయ సంగీత వాయిద్యాలు వంటి రకరకాలవి ఉన్నాయి. ఇవేలం ను అక్టోబర్ 3 వరకు మాత్రమే నిర్వహించాలని మొదట అనుకున్నారు. అయితే మరో మూడువారాలు పొడిగించారు. శుక్రవారం నాటికి వేలం వేయాల్సిన వస్తువులన్నీ పూర్తయ్యాయి. 

బాలీవుడ్ నటులు అనీల్‌కపూర్, అర్జున్‌కపూర్, గాయకుడు కైలాష్ ఖేర్ వంటి సెలెబ్రెటీలు, రాజకీయనాయకులు, వివిధ రంగాల కార్యకర్తలు ఈ ఇ వేలంపట్ల ఆసక్తి చూపారు. వేలంలో గణేషుడి చిన్న విగ్రహం, కమలం రూపంలో అలంకరించిన చెక్క పెట్టె వంటి చిన్న వస్తువులకు కనీస ధర రూ. 500 గా నిర్ణయించారు.