చంద్ర బాబుకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుంది

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మండిపడ్డారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్‌ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు

‘ఆర్టీసీ జేఏసీ నాయకులు సమ్మెపై నాతో చర్చించారు. 20 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తుంటే.. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత కేసీఆర్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కూతురు ఓడిపోతే ప్రెస్ నోట్ లేదు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఓడిపోయినప్పుడు కూడా మీడియా సమావేశం పెట్టలేదు. కానీ, ఉపఎన్నికలో గెలిచిన అనంతరం గంటసేపు మీడియా సమావేశం నిర్వహించారు' అంటూ ఎద్దేవా చేశారు. 

ఇలాంటి ఉప ఎన్నికల ఫలితాల్ని ఎన్నో ప్రభుత్వాలు చూశాయని చెబుతూ  హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఓ గెలుపేనా అని ప్రశ్నించారు. కులానికి, మతానికో నాయకున్ని పెట్టి.. అధికార దుర్వినియోగంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని విమర్శించారు. ఆర్టీసీ సమ్మెకు హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితానికి సంబంధమేంటని నిలదీశారు. "నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ భారీ మెజార్టీతో గెలిచినా.. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి ఏమైంది. రేపు ​మీకూ అదే గతి పడుతుంది" అని హెచ్చరించారు. 

రాజకీయాలు ఉంటే చూసుకుందాం. కానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా కార్మికుల మీదనా మీ ప్రతాపమా అంటూ  కేసీఆర్ ను నిలదీశారు. కేసీఆర్‌ ఆర్టీసీ ఆస్తులపై కన్నేశారు. అందుకనే ఉద్యమం మీద బిజెపి కన్నేసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి మాటలకు ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని,  ఆత్మహత్యలు చేసుకోవద్దని లక్ష్మణ్ చెప్పారు.  భవిష్యత్ లో ఆర్టీసీ కార్మికులు చేపట్టే ప్రతి కార్యక్రమానికి బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

కాగా, ‘ముఖ్యమంత్రి ఎన్ని బెదిరింపులకు గురి చేసినా ఏ ఒక్క కార్మికుడు విధుల్లో చేరలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి గుర్తు చేశారు. కార్మికుల ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలే అని స్పష్టం చేశారు.

ఈనెల 30న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించే సకల జనుల సమర భేరికి  కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపిచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మహత్యలకు కేసీఆర్ బాధ్యుడని కేసులు పెట్టారని గుర్తు చేస్తూ ఇప్పుడు తనపై పెట్టె కేసులు కూడా ఎత్తుగడల్లో భాగమేనని స్పష్టం చేశారు. కేసులకు  భయపడను. ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు.