కాంగ్రెస్-ఎన్‌సీపీ కూటమి మధ్య అగ్గి   

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 24 గంటలు కూడా గడవక ముందే కాంగ్రెస్-ఎన్‌సీపీ కూటమి మధ్య అగ్గి రాజుకుందా? అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. శాసనసభలో విపక్ష పార్టీ నేత హోదా తమకే దక్కాలని రెండు పార్టీలు పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) ఊహించని విధంగా 54 సీట్లు గెలుచుకుంది. ఎన్నికలకు ముందు బీజేపీలోకి పార్టీ నేతల ఫిరాయింపులతో ఎన్‌సీపీ ఉనికే గల్లంతవుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్‌సీపీ పార్టీ పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ సైతం 44 సీట్లు గెలుచుకుని ఉనికి నిలబెట్టుకుంది. 

ఈ నేపథ్యంలో మెజారిటీకి అవసరమైన బలం లేకపోయినప్పటికీ బలమైన ప్రతిపక్షంగా ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూటమి నిలిచింది. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ నేత హోదాపై రెండు పార్టీలు పట్టుదలగా ఉన్నాయని తెలుస్తోంది. మహారాష్ట్రలో రాబోయే రోజుల్లో పూర్వవైభవం సంతరించుకోవాలంటే ప్రతిపక్ష హోదా కీలకమని విపక్ష కూటమి నేతలు నిశ్చితాభిప్రాయంతో ఉన్నట్టు చెబుతున్నారు.