బిజెపికి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు

ఐదు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కేంద్రంలో రెండోసారి అధికారానికి వచ్చిన బిజెపి రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించింది.  మహారాష్ట్రలో ప్రభంజనం సృష్టిస్తాయనుకున్న బీజేపీ-శివసేనలు సాధారణ మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకున్నాయి. 

ఇక హర్యానాలో మెజారిటీ సీట్లు సాధించి రెండోసారి పగ్గాలు చేపట్టాలనుకున్న బిజెపి అంచనాలు ఫలించలేదు. ఆ రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీని ఇవ్వకపోవడంతో అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అయితే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ స్వతంత్రుల సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నది. 

దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల పరిధిలో ఉప ఎన్నికలు జరిగిన 51 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 26 సీట్లను గెలుచుకోగా, కాంగ్రెస్ 12 స్థానాలను దక్కించుకుంది. మిగిలిన సీట్లను ప్రాంతీయ, ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం మొదటిసారిగా బీహార్‌లో తన ఖాతాను తెరిచింది. 

ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందిస్తూ దీపావళికి ముందే ప్రజలు తమను ఆశీర్వదించారని పేర్కొన్నారు. మహారాష్ట్ర, హర్యానా ఫలితాలు తమ పాలనకు గీటురాయి అని తెలిపారు.రెండు లోక్‌సభ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో మహారాష్ట్రలోని సతారా స్థానాన్ని ఎన్సీపీ, బీహార్‌లోని సమస్తిపూర్ సీటును లోక్‌జనశక్తి పార్టీ గెలుచుకున్నాయి. 

గత లోక్‌సభ ఎన్నికల్లో పూర్తిగా చతికిలబడిన కాంగ్రెస్ మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించింది. శరద్‌పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) బాగా పుంజుకుంది. తన భాగస్వామి కాంగ్రెస్ కన్నా ఈసారి ఎన్సీపీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడం విశేషం. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 105, శివసేన 56 స్థానాలను గెలుచుకున్నాయి.

ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా జాతీయవాద అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ ఓటర్లు వాటి పట్ల ఆసక్తి చూపినట్టు కనిపించలేదు. ఈ ఎన్నికల్లో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు సైతం తారుమారు కావడం గమనార్హం. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి 200 నుంచి 230 వరకు సీట్లు గెలుచుకుంటాయని ఆయా సర్వే సంస్థలు అంచనా వేశాయి. అలాగే హర్యానాలోనూ బీజేపీ 75 సీట్ల వరకు గెలుచుకొని రెండోసారి అధికారాన్ని చేపడుతుందని జోస్యం చెప్పాయి. 

కానీ రెండు రాష్ట్రాలలోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు 145 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరముండగా, బీజేపీ-శివసేన కూటమి 161 స్థానాలను గెలుచుకుంది. 90 సీట్లున్న హర్యానా అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు 46 సీట్లు అవసరం కాగా బీజేపీ 40 స్థానాల వద్దనే ఆగిపోయింది. అయితే ఇండిపెండెంట్లుగా గెలుపొందిన తమ పార్టీ రెబల్స్‌ను మళ్లీ అక్కున చేర్చుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నది.