భారత్‌లోనే తగ్గుముఖం పట్టిన శిశు మరణాలు

భారత్‌లో స్వచ్ఛమైన నీరు, పారిశు ద్ధ్యం, పోషకాహారం, మౌలిక ఆరోగ్య వసతులు అందుబాటులో లేక ప్రతి రెండు నిమిషాలకు సగటున ముగ్గురు శిశువులు మరణిస్తున్నారని ఐరాస అనుబంధ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ (యూనిగ్మే) సంస్థ నివేదిక తెలిపింది. గత ఏడాది భారత్‌లో 8.02 లక్షల నవజాత శిశు మరణాలు నమోదయ్యాయని అందులో పేర్కొన్నది. అయితే అది గత ఐదేండ్లతో పోలిస్తే చాలా తక్కువని తెలిపింది. అయినా ఇంకా,  ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లోనే శిశు మరణాలు సంభవిస్తున్నాయని ఈ నివేదిక వెల్లడి చేస్తున్నది. 

ఐదేండ్లలోపు బాలల మరణాల సంఖ్య భారత్‌లో గత ఐదేండ్లలో తొలిసారి పది లక్షలకన్నా తక్కువగా నమోదైందని తెలిపింది. గత ఏడాది ఐదేండ్లలోపు బాలలు 9.89 లక్షల మంది మరణించారని పేర్కొంది. శిశు మరణాలను అరికట్టేందుకు భారత్ అనేక చర్యలు తీసుకుంటున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)లో ఆరోగ్య విభాగం అధిపతి డాక్టర్ గగన్ గుప్తా తెలిపారు.

భారత్‌లో ఏటా 2.5 కోట్ల మంది జన్మిస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయాన్ సూచించారు. ప్రపంచవ్యాప్తంగా జన్మిస్తున్న శిశువుల్లో 18 శాతం మంది భారత్‌లోనే పుడుతున్నారని పేర్కొన్నారు. గత ఐదేండ్లలో భారత్‌లో శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని యూనిసెఫ్‌లో భారత ప్రతినిధి యాస్మిన్ అలీ హక్ తెలిపారు.  శిశువుల మరణాలు 2016లో 8.67 లక్షలు కాగా, అది 2017 నాటికి 8.02 లక్షలకు తగ్గిందని గుర్తు చేసారు.

2016లో శిశు మరణాల రేటు ప్రతి వెయ్యి జననాలకు 44గా ఉం దన్నారు. గత ఐదేండ్లతో పోలిస్తే భారత్‌లో శిశు మరణాల సంఖ్య తగ్గినా సంబురపడనవసరం లేదని బాలల హక్కుల సంస్థ క్రై డైరెక్టర్ ప్రీతి మహారా భావిస్తున్నారు. ప్రపంచ ఆకలి సూచిలో భారత్ 119 దేశాలలో 100వ స్థానంలో ఉందని ఆమె గుర్తు చేశారు. పోషకాహార లోపం వల్లే ఆకలి స్థాయి పెరుగుతున్నదని ఆమె చెప్పారు.