మహారాష్ట్రలో బిజెపి-శివసేన కూటమి, హర్యానాలో హంగ్  

మహారాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా కాంగ్రెసేతర కూటమి - బీజేపీ, శివసేన కూటమి అసెంబ్లీ ఎన్నికలలో స్పష్టమైన ఆధిక్యత సాధించాయి. దానితో మరోసారి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. 4 గంటల ప్రాంతంలో కూటమి 158 సీట్లు గెల్చుకొనే అవకాశం ఉండగా, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి 103 సీట్లకు పరిమితం కావలసి వస్తున్నది. ఇతరులు 27 వరకు సీట్లు గెల్చుకొనే అవకాశాలు ఉన్నాయి. 

బిజెపి 99 సీట్లలో, శివసేన 59 సీట్లలో ఆధిక్యతలో ఉండగా, కాంగ్రెస్ 42 సీట్లలో, ఎన్సీపీ 55 సీట్లలో ఆధిక్యతలో ఉన్నాయి. ఏఐఎంఐఎం మూడో సీట్లు, ఎంఎన్ ఎస్ ఒక సీట్లు గెల్చుకోనున్నాయి. ఆశించిన మేరకు సీట్లు గెల్చుకోలేకపోయినా, విడివిడిగా పోటీచేసి 2014 ఎన్నికలలో గెలుపొందిన సీట్లకేనా 27 సీట్లను తక్కువగా గెల్చుకోవలసి వస్తున్నా, తమ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజా తీర్పు రావడం బిజెపి, శివసేన వర్గాలలో సంబరాలు వ్యక్తం అవుతున్నాయి. 

కాగా, మొదటిసారిగా రాష్ట్రంలో నాలుగో స్థానానికి కాంగ్రెస్ కుదించుకు పోయింది. 80 ఏళ్ళ వయస్సులో కూడా విస్తృతంగా ప్రచారం జరపడం ద్వారా ఎన్సీపీ అధినేత శరద్ పవర్ తమ పార్టీకి 55 వరకు సీట్లు తెచ్చుకోగలిగారు.

కాగా, హర్యానాలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత లభించే అవకాశాలు కనిపించడం లేదు. 90 సీట్లలో ప్రస్తుతం అధికారమలో ఉన్న బీజేపీ 39 సీట్ల వద్ద ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సహితం 32కు మించి సీట్లు గెల్చుకొనే అవకాశాలు కనిపించడం లేదు. దానితో 10 సీట్లు గెల్చుకున్న జేజేపీ అధినేత దుశ్యంత్ నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతరులు మరో 9 సీట్లు గెల్చుకున్నారు. 

ఈ ఎన్నికలలో పార్టీ ఫిరాయింపులు జరిపిన అనేకమంది ఓటమి చెందారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా బిజెపి అధికంగానే సీట్లు పొందగలిగింది.