కాంగ్రెస్‌ కంచుకోటలోటీఆర్‌ఎస్‌ ఘనవిజయం  

ప్రతిష్టాత్మకంగా మారిన హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ భారీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి శైనంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై 43,284 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ప్రచారం పరంగా టీఆర్ఎస్‌కు గట్టిగా పోటీ ఇచ్చిన కాంగ్రెస్.. ఆ పోటీ కౌంటింగ్‌లో అస్సలు కనిపించలేదు. కౌంటింగ్ ప్రారంభం మొదలుకుని చివరి రౌండ్ వరకూ టీఆర్ఎస్ కారు ఓవర్ స్పీడ్‌తోనే దూసుకెళ్లింది. 

‘కారు’ జోరుకు కాంగ్రెస్ ‘హస్తం’ నిలబడలేకపోయింది. ఏ ఒక్క రౌండ్‌లోనూ ‘హస్తం’ హవా అస్సలు కనిపించలేదు. ఇక బీజేపీ, టీడీపీ పార్టీలకు.. ఇండిపెండెంట్‌ అభ్యర్థి కంటే తక్కువగా రావడం గమనార్హం. కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితమవ్వగా.. స్వత్రంత్ర అభ్యర్థి మూడో స్థానం దక్కించుకున్నారు.

 కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట అయిన హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ జెండా పాతడంతో రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ భవన్‌లో సంబరాలు జరుగుతున్నాయి. హుజూర్‌నగర్‌లో గులాబీ శ్రేణులు గులాల్‌ చల్లుకుంటూ ఆనందోత్సాహల్లో మునిగితేలారు.  

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీచేసి గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. తనకు కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో మరోసారి గెలుపు ఖాయమన్న ధీమాతో ఉత్తమ్‌.. తన సతీమణి పద్మావతిని బరిలోకి దింపారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన సైదిరెడ్డిని మరోసారి టీఆర్‌ఎస్‌ బరిలోకి దింపింది. బీజేపీ, టీడీపీ వంటి పార్టీలు బరిలో నిలిచినా.. పెద్దగా ప్రభావం చూపలేదు. 

టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టుగా సాగింది. ఇరుపార్టీల అగ్రనేతలు పెద్దసంఖ్యలో మోహరించి.. భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ సమ్మె జరగడం, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర వాతావరణం ఉండటంతో ఆ ప్రభావం హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికపై పడుతుందేమోనన్న ఆందోళన గులాబీ శ్రేణుల్లో కనిపించింది.  

అయితే, ఈసారి హుజూర్‌ నగర్‌ ప్రజలు గులాబీ అభివృద్ధి మంత్రానికి ఓటేశారు. మూడుసార్లు గెలిపించినప్పటికీ ఉత్తమ్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని, గులాబీ గెలుపుతోనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమంటూ సైదిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ ప్రచారం ఫలించినట్టు ఉప ఎన్నిక ఫలితాల్లో స్పష్టమవుతోంది. ఇక్కడ అంచనాలకు మించి కారు జోరుగా దూసుకుపోతుండటంతో ప్రతిపక్ష పార్టీలు బొక్కాబోర్లా పడ్డాయి.