కాంగ్రెస్ చెప్పిన్నట్లు ఎన్నికలు నిర్వహించడం కుదరదు

కాంగ్రెస్ పార్టీ తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ చెప్పినట్లుగా ఎన్నికలు నిర్వహించడం కుదరదు అని సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఎన్నికల సంఘం ఓ రాజ్యాంగ బద్ధ సంస్థ. అది చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుంది తప్ప ఓ రాజకీయ పార్టీ చెప్పినట్లు కాదు అని ఈసీ తేల్చి చెప్పింది.

కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈసీ ఇలా ఘాటుగా స్పందించింది. ఇలాంటి విషయాల్లో ఎన్నికల సంఘం ఎలా నడుచుకోవాలో చెప్పే అధికారం సదరు పిటిషనర్, ఆయన పార్టీకి లేదు అని ఈసీ తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఎన్నికల సంఘం విధుల్లో పదేపదే జోక్యం చేసుకుంటూ, ఇలా ఒకే అంశంపై మళ్లీ మళ్లీ కోర్టుకు ఎక్కడం సరికాదు అని ఈసీ చెప్పింది.

కచ్చితంగా ఇలాగే ఎన్నికలు నిర్వహించాలని అడిగే లేదా ఆదేశించే హక్కు కమల్‌నాథ్‌కు, ఆయన పార్టీకి లేదని స్పష్టంచేసింది. తాను, తన పార్టీ అనుకున్నట్లుగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఓ అసంబద్ధమైన చర్య అని ఈసీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ పిటిషన్‌ను వెంటనే కొట్టేసి, పిటిషనర్‌కు జరిమానా విధించాలని కోర్టును కోరింది.

ఎన్నికల నిర్వహణలో తమ పాత్ర, విధులు తమకు తెలుసని, అందుకు తగినట్లే తాము వ్యవహరిస్తామని ఎన్నికల కమీషన్ స్పష్టంచేసింది. వీవీప్యాట్ మెషీన్లలో ఓటు ఎవరికి వేసిన ఒకే పార్టీకి వెళ్తున్నదని పిటిషనర్ చేసిన ఆరోపణ పూర్తిగా నిరాధారమని ఈసీ తెలిపింది. మధ్యప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘానికి పలు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరుతూ కమల్‌నాథ్ సుప్రీంకోర్టుకు వెళ్లారు.