రాజన్న రాజ్యం పేరుతో రాష్ట్రంలో పోలీసు రాజ్యం  

‘‘రాజన్న రాజ్యం పేరుతో రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోంది. ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం ఉపకులపతిపై అక్రమంగా కేసు బనాయించడమే ఇందుకు నిదర్శనం’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. బిజెపి ఆధ్వర్యంలో కొనసాగుతున్న గాంధీ సంకల్ప యాత్రలో అనంతపురం జిల్లా  బుక్కరాయసముద్రం మండలంలో పాల్గొంటూ బిజేపీలో చేరే వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

శ్రీశైలం దేవస్థానంలో అన్యమత ప్రచారంపై ఉద్యమించిన ఇద్దరిపై రౌడీషీట్లు ఓపెన్‌ చేయించారని మండిపడ్డాయిరు. అవినీతి, అరాచకాలు, హత్యలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి వైసీపీ కండువా కప్పుకోకపోతే కేసులు బనాయిస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. పాలనపై సీఎం జగన్‌ పట్టు కోల్పోయారని పేర్కొంటూ  రాష్ట్రం బాగోగులు కోరే ఏ సీఎం అయినా కేంద్రంతో సఖ్యతగా ఉండాలని ఆయన జగన్‌ను ఉద్దేశించి హితవు పలికారు.  

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని కన్నా ఆరోపించారు. ప్రభుత్వం అస్తవ్యస్థ నిర్ణయాలతో పాలన గందరగోళంగా మారిందని విమర్శించారు. ప్లాస్టిక్ వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించిందని, ప్రజలందరూ స్వచ్ఛ భారత్‌లో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గాంధీ సంకల్పయాత్రకు విశేష స్పందన లభిస్తోందని చెబుతూ ఈనెల 31 వరకూ ఈ పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు.   

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం బిజెపితోనే సాకారమవుతోందని స్పష్టం చేశారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గాంధీ ఆశయాలకు అద్దం పడుతూ వాటిని నెరవేరుస్తున్నారని చెబుతూ తామే గాంధీ అసలైన వారసులమని తెలిపారు.  ఇప్పటి వరకూ గాంధీ పేరు వాడుకున్నారని, నకిలీ గాంధీలు, నకిలీ పార్టీలు పాలన సాగించి కాలయాపన చేశాయని ఆరోపించారు. అయినా గాంధీ ఆశయాలు, 

ఆకాంక్షలను నెరవేర్చలేదని కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశారు. 

బీజేపీ గ్రామాభివృద్ధికి కృషి చేస్తోందని, చిట్టచివరి వ్యక్తి వరకూ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. గాంధీ కోరిన స్వచ్ఛ భారత్‌ను బీజేపీ అమలు చేయబోతే రాహుల్ గాంధీ వ్యతిరేకించారని, కానీ మోదీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించి స్వచ్ఛ భారత్‌కు అర్థం చెప్పామని తెలిపారు. అలాగే బ్యాంకుల్లో 35 కోట్ల జన్‌ధన్ ఖాతాలు జీరో బ్యాలెన్స్‌తో ప్రారంభించిన ఘనత బీజేపీదేనని చెబుతూ గాంధీ ప్రారంభించిన సర్వోదయ ఉద్యమం స్ఫూర్తితోనే బీజేపీ అంత్యోదయ పథకం అమలు చేస్తోందని వివరించారు.