ఆర్టీసీ కార్మికులతో చర్చలకు చివరికి కేసీఆర్ సిద్ధం!

ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ఎట్టకేలకు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ మినహాయించి మిగతా 21 డిమాండ్లను పరిశీలించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఉన్నతాధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో సుదీర్ఘంగా సమాలోచనలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల సాధ్యాసాధ్యాలపై సీఎం చర్చించారు. 

ఈ నెల 28న ఆర్టీసీ సమ్మెపై తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను వదులుకున్నట్టు కార్మిక సంఘాలు హైకోర్టుకు స్పష్టం చేయడంతో ఇతర డిమాండ్లను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. 

అయితే, ఈ డిమాండ్లను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీ వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు ఆరుగురు ఈడీలతో ఆర్టీసీ ఇన్‌చార్జి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ కమిటీని నియమించారు. ఈడీల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలని సీఎం సమక్షంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం నిర్ణయించారు. 

ఈడీల కమిటీ ఒకటి రెండు రోజుల్లో తన నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రోద్బలంతో చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెకు కాంగ్రెస్, బీజేపీ మద్దతు ఇవ్వడం అనైతికమని సీఎం తప్పుబట్టారు. ఆర్టీసీ రూట్లను ప్రైవేట్‌పరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు కల్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందని సీఎం గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాలనే తెలంగాణలో బీజేపీ నేతలు తప్పుబట్టడం విచిత్రమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.