వారాణసిలో రూ 550 కోట్ల ప్రాజెక్ట్లు ప్రకటించిన ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన 68వ జన్మదినోత్సవం సందర్భంగా రెండు రోజులపాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారాణసిలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ 550 కోట్ల వ్యయం కాగల పలు అభివృద్ధి ప్రాజెక్ట్ లను ప్రకటించారు. కొన్ని పధకాలకు ప్రారంభోత్సవాలు, మరికొన్నింటికి శంకుస్థాపనలు జరిపారు.

ప్రధాని జన్మదినోత్సవం సందర్భంగా బిజెపి కార్యకర్తలు కూడా పలు కార్యక్రమాలు జరిపారు. 68 చోట్ల ఎర్త్ దీపాలను అమర్చారు. మోదీ 68వ పుట్టినరోజును పురస్కరించుకొని వారణాసిలోని 68 ప్రాంతాలలో 68 కిలోల బరువున్న 68 కేకులను కట్ చేశామని వారణాసి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నీలకంఠ తివారీ ప్పారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ జిల్లాలో ఉన్న 68 మంది ఖైదీలను విడుదల చేసింది.

గతంలో వారణాసిలో పరిస్థితులు దైవాధీనం అన్నట్లుగా ఉండేవని, కానీ ఇప్పుడు అవి మారుతున్నాయని మంగళవారం జరిగిన ఒక బహిరంగసభలో మాట్లాడుతూ సంతృప్తి వ్యక్తం చేసారు. సానుకూల మార్పులు చేస్తూనే ఈ నగర ఘనమైన వారసత్వాన్ని నిలబెడుతున్నామని చెబుతూ వారణాసిలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లోనూ రోడ్లు, నీళ్లు, కరెంటు సరఫరా మెరుగుపడింది అని మోదీ తెలిపారు.  

హర్ హర్ మహదేవ్ అంటూ తన ప్రసంగాన్ని మొదలుబెడుతూ “ నేను మీ కొడుకుని” అని అన్నారు. 50 నిమిషాల ప్రసంగంలో మోదీ చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. కాశీలో గతంలో ఎక్కడ చూసినా విద్యుత్ తీగలు వేలాడుతూ కనిపించేవని, ఇప్పుడు చాలా వరకు మాయమయ్యాయని, పూర్తిగా భూగర్భ వైరింగ్ చేస్తున్నామని మోదీ చెప్పారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో అత్యాధునిక ట్రౌమా సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో వారణాసి ఇక ఓ హెల్త్ హబ్‌గా మారనుందని ప్రకటించారు.

వారాణసిలో అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించే క్యాన్సర్, సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాంతంలోని అన్ని గ్రామాలకు విద్యుత్, రహదారులు, త్రాగునీటి సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.

గత సాయంత్రం కాశీ విద్యాపీఠ్‌కు చెందిన విద్యార్థులను కలుసుకున్నప్పుడు ప్రశ్నించడానికి ఎప్పుడూ భయపడవద్దని, అభ్యాసనకు అదే కీలక అంశమని ప్రధాని ఉద్బోధించారు. విద్యార్థులుగా ప్రశ్నలు వేయడం ముఖ్యం. ప్రశ్నలు అడిగేందుకు ఎప్పుడూ భయపడవద్దు. క్రీడలకు ప్రాముఖ్యతనివ్వాలి. బయటకు వెళ్లి ఆడుకోవాలి అని చెప్పడంతో విద్యార్థుల ముఖాలు నవ్వులతో వెలిగిపోయాయి.