పర్యాటక కేంద్రంగా  సియాచిన్ గ్లేసియర్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న యుద్ద క్షేత్రం సియాచిన్ గ్లేసియర్. లడఖ్ లో సుందరమైన ప్రదేశమైన సియాచిన్ క్షేత్రంకు పర్యాటకులను అనుమతించాలని కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోంది. సియాచిన్ బేస్ క్యాంప్ నుంచి కుమార్ పోస్ట్ వరకు ఉన్న ప్రాంతాన్ని పర్యాటకుల సందర్శన కోసం తెరువనున్నట్లు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. 

లడఖ్ పర్యాటక రంగం అభివృద్ధికి ఎక్కువ అవకాశముంది. లడఖ్ కు వివిధ ప్రాంతాలతో ఉన్న కనెక్టివిటీ వల్ల పెద్ద సంఖ్యలో పర్యాటకులు లడఖ్ కు వచ్చే అవకాశాలున్నాయని రాజ్ నాథ్ ట్వీట్ చేశారు. సియాచిన్ బేస్ క్యాంప్ నుంచి కుమార్ పోస్టు వరకు ఇక నుంచి పర్యాటకులు సందర్శించవచ్చునని పేర్కొన్నారు

సియాచిన్, కార్గిల్ ప్రాంతాలలో సైనిక శిభిరాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ సియాచిన్‌ ప్రాంతంలో ఉద్రిక్తతల భయం ఉండేది. ఆర్టికల్ 370 రద్దుతో ఆ భయాలన్నీ పోయానని కేంద్రం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భారత సైనిక శిబిరాలను సందర్శించాలన్న దేశ ప్రజల కోరిక నెరవేరనుంది.  

చైనా, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) మధ్య ఉండే ఓ చిన్న ప్రదేశం సియాచిన్ గ్లేసియర్. రెండు వివాదాస్పద దేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న ప్రాంతం కావడంతో ఇక్కడికి సాధారణ ప్రజలు వెళ్లే అనుమతి లేదు. 

ఇప్పటిరకు సైన్యానికి కావాల్సిన సామాగ్రిని చేరవేసేందుకు ఎంపిక చేయబడ్డ కొందరు కూలీలు, కొంతమంది జర్నలిస్టులకు మాత్రమే అవకాశం ఉండేది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సాధారణ పౌరులు కూడా సియాచిన్ ను సందర్శించడానికి అవకాశం ఏర్పడింది.