బిజెపిలో చేరిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మరో షాక్‌ తగిలింది. ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, టీడీపీ నేత ఆదినారాయణ రెడ్డి ఇవాళ బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఆదినారాయణ రెడ్డికి బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఆదినారాయణ రెడ్డి 2014లో వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. ఆదినారాయణ రెడ్డి 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి కడప పార్లమెంట్‌ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. 

వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని ఊహాగానాలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలతోపాటు టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.  

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బిజెపి వల్లే సాధ్యం అని, స్థానిక పార్టీల వల్ల కాదని ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. సిఎం జగన్ చెప్పేదొకటి చేసేది మరోటి అని విమర్శించారు.

అందరూ వద్దని చెప్పినా పోలవరం ప్రాజెక్టు నిర్మాణపనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ కు వెళ్లారని, అలాగే, రాజధాని అమరావతిపై ఎన్నో అనుమానాలు రేకెత్తించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం బాగుపడాలంటే బిజెపి వల్లే సాధ్యం అన్నారు. ఎపిలో బిజెపి బలపడాలని, ప్రజలు బాగుపడాలని కోరుకుంటున్నానని చెప్పారు.