దేశంలో ఎక్కడా లేని పరిస్థితి తెలంగాణలో 

దేశంలో ఎక్కడా లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని చెప్పారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి రోడ్డెక్కిన కార్మికులను ఇంతలా అణచివేస్తున్న ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదని ధ్వజమెత్తారు. 48 వేల మంది ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రెండు వారాలు దాటినా ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేదని మండిపడ్డారు. 

చివరకు హైకోర్టు ఆదేశించినా కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ఏం జరుగుతుందో చూద్దామన్నట్టుగా సీఎం కేసీఆర్ మొండిగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. పార్టీ సంస్థాగత సమావేశంలో పాల్గొనడానికి హైదరాబాద్‌కు వచ్చిన అరుణ్ సింగ్ కార్మికుల పోరాటంలో చివరివరకూ బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయలేదని స్పష్టం చేశారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించబోతుందని అరుణ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ అప్రజాస్వామిక పాలన మెడలు వంచడానికి మేధావులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టీసీతోపాటు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు.