ఖమ్మం ఎంపీ వ్యాపార సంస్థల్లో ఐటీ సోదాలు

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాపార సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లో 12 చోట్ల, ఖమ్మంలో 6 చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ సర్కిల్‌ సమీపంలోని ఎంపీ నివాసంలో ఉదయం 9 గంటల నుంచి సోదాలు చేపట్టారు.

ఎంపీ ఇంటిలోకి ఎవరూ ప్రవేశించకుండా రెండు గేట్లను మూసివేశారు. మరోవైపు బంజారాహిల్స్‌లోని రాఘవ ఇన్‌ఫ్రా కార్యాలయంలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ తనిఖీలు రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ సోదాలపై ఎంపీ పొంగులేటి స్పందిస్తు ఇవి సాధారణ సోదాలేనని స్పష్టం చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి నుంచి గెలుపొందిన పొంగులేటి 2016 ఏప్రిల్‌లో టి ఆర్ ఎస్ లో చేరారు.