నిర్బంధంలో ఉన్న నేతలు కశ్మీరీలను రెచ్చగొడుతున్నారు 

జమ్మూ-కశ్మీరును విభజించిన తర్వాత నిర్బంధంలో ఉన్న కొందరు రాజకీయ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఆరోపించారు. తుపాకులు పట్టి, త్యాగాలు చేయాలని సందేశాలు పంపిస్తున్నారని చెప్పారు. శ్రీనగర్‌లోని ఠాగూర్ హాల్‌లో ఆదివారం జరిగిన బీజేపీ మద్దతుదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆగస్టు 5న జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక హోదా రద్దయింది. ఆ తర్వాత కశ్మీరులో ఏర్పాటైన సమావేశంలో బీజేపీ నేత ఒకరు మాట్లాడటం ఇదే మొదటిసారి. కశ్మీరులో కస్టడీలో ఉన్న కొందరు రాజకీయ నేతలు కశ్మీరీలను రెచ్చగొడుతున్నారని, తుపాకులు పట్టుకుని, త్యాగాలు చేయాలని సందేశాలు పంపిస్తున్నారని రామ్ మాధవ్ చెప్పారు. 

ముందుగా ఆ రాజకీయ నేతలనే త్యాగాలు చేయమని అడగాలని ప్రజలకు చెప్పాలనుకుంటున్నానని తెలిపారు. స్వయంగా త్యాగాలు చేసి, ఇతరులను అడగాలని ఆ రాజకీయ నేతలకు చెప్పాలని ప్రజలను కోరారు. ఇలాంటి రాజకీయాలు ఆమోద యోగ్యం కాదన్నారు. కొత్త పాలన ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి’ ప్రాతిపదికపై జరుగుతుందని, ఇదే మోదీ ప్రభుత్వ ఆశయమని తెలిపారు.

అభివృద్ధి, శాంతి మార్గంలో తాము నడుస్తామని చెప్పారు. దీని కోసం 200 లేదా 300 మందిని నిర్బంధంలో ఉంచాలంటే, అలాగే ఉంచుతామని చెప్పారు.