అన్ని కోల్పోయిన టిడిపితో కలిస్తే బీజేపీకే నష్టం 

బిజెపి తిరిగి టిడిపితో పొత్తు పెట్టుకొనే ప్రసక్తి లేదని పార్టీ నేతలు జివిఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అన్ని కోల్పోయిన టిడిపితో కలిస్తే బీజేపీకే నష్టమని జివిఎల్ విజయవాడలో `మీట్ ది ప్రెస్'లో తెలిపారు. 

టీడీపీతో బీజేపీ ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరులో తేల్చి చెప్పారు. టీడీపీకి అమిత్‌షా ఎప్పుడో శాశ్వతంగా తలుపులు మూసేశారని గుర్తు చేశారు. అవకాశవాద రాజకీయాలతో యూటర్న్‌లు తీసుకుంటూ దేశ రాజకీయాల్లో విలువలను దిగజార్చిన పార్టీ టీడీపీ అని విమర్శించారు. ఏ మొహం పెట్టుకుని పొత్తుకు వెంపర్లాడుతున్నారో చెప్పాలని కన్నా నిలదీశారు.   

అయితే చంద్రబాబునాయుడు టిడిపిని బీజేపీలో విలీనం చేస్తానంటే తాను కూడా తమ పార్టీ అధిష్ఠానంతో మాట్లాడతానని బిజెపి ఎంపీ జీవిల్ నరసింహారావు చెప్పారు. కాగా, చంద్రబాబును బీజేపీకి దగ్గర చేస్తానని సుజనాచౌదరి చెప్పినట్లు తనకు తెలియదన్నారు. టీడీపీ నుంచి వచ్చిన సుజనాకు కొంత ఆ పార్టీపై అభిమానం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. లేదంటే బీజేపీ, టీడీపీ కలిస్తే బాగుంటుందనే అభిప్రాయం కావొచ్చేమోనన్నారు.

రాజకీయ భవిష్యత్ గురించి చంద్రబాబు ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోందని జివిఎల్  పేర్కొన్నారు. చిదంబరం వంటి నేతలను చూసి చంద్రబాబు భయపడుతున్నారేమోనని తెలిపారు. అవినీతి ఎవరు చేసినా వారిపై చర్యలు ఉంటాయని ప్రధాని ప్రకటించారన్నారు. అటువంటి ప్రకటనల వల్ల అవినీతిపరులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు.

పోలవరం పనుల్లో అవినీతి జరిగిందని బీజేపీ మొదటినుంచీ చెబుతున్నట్లు జివిఎల్ వెల్లడించారు. రూ 2,209 కోట్ల అవినీతి జరిగిందని వైసీపీ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. కానీ ఆ అవినీతిపై ఎక్కడా చర్యలు ఎందుకు తీసుకోలేదో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా అవినీతి అంశాలపై పుస్తకాలు ముద్రించారని చెబుతూ మరిప్పుడు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా ఎవరినీ అరెస్ట్ చేయలేదేంటని నిలదీశారు. 

రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా అయితే స్వాగతిస్తామని చెప్పా. కానీ పనులు బాగా ఆలస్యం అయితే అన్ని విధాలా నష్టం జరుగుతుందన్న సంగతి ప్రభుత్వం గుర్తించాలని హితవు పలికారు. పోలవరం పనులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి అన్ని వివరాలు కేంద్రానికి అందలేదని జివిఎల్ తెలిపారు. అందువల్లే కేంద్రం నుంచి నిధులు కేటాయింపు ఆలస్యం అవుతుందని స్పష్టం చేశారు. 

రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ఎక్కడెక్కడ ఎవరెవరు భూములు కొన్నారో ప్రభుత్వం వద్దే జాబితా ఉందన్నారు. టీడీపీ ఎంపీలు బీజేపీలోకి రావడం చట్ట ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెబుతూ నల్లధనం అరికట్టేందుకు కేంద్రం అనేక చట్టాలను తీసుకొచ్చిందని గుర్తు చేశారు.