నితీష్ – ప్రశాంత్ జోడి `పరాజితుల’ కలయక !

ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో కీలకమైన పాత్ర వహించిన ప్రశాంత్ కిషోర్ కు ఎన్నికల వ్యుహకర్తగా మంచి పేరొచ్చింది. ఆ తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో `మహాకుటమి’ విజయంతో ఆయనకు మరింతగా క్రేజ్ పెరిగింది. అయితే ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఆయనతో పెద్దగా ప్రయోజనం కలగక పోవడంతో ఆయన గురించి ఎవ్వరు పట్టించుకోవడం మానివేసారు. ఆంధ్రప్రదేశ్ లో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన సేవలను వినియోగించు కొంటున్నా చెప్పుకోదగిన ఫలితాలు చూపలేక పోయారు.

మరోవంక దేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి పోటీ ఇవ్వగల నేతగా మొదట్లో ప్రచారం పొందిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విధిలేని పరిస్థితులలో `మహాకుటమి’ నుండి బైటకు వచ్చి మళ్ళి బిజెపితో చేతులు కలప వలసి వచ్చింది. వరుసగా ఉపఎన్నికలలో ఓటమి తప్పడం లేదు. దానితే వచ్చే ఎన్నికలలో బిజెపితో సీట్ల సర్దుబాటు దగ్గర నుంచి, రాష్ట్రంలో అధికారం నిలభేట్టుకోవడం వరకు ఒకవిధంగా దిక్కుతోచని విధంగా ఉన్నారు.

ఇటువంటి పరిస్థితులలో ఎన్నికల వ్యుహకర్తగా విఫలమై, తనకంటూ ఒకరాజకీయ సిద్దాంతం లేకుండా ఏ పార్టీతో, ఏ నాయకుడితో అయినా పనిచేయగల ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు సోషలిస్ట్ సిద్దంతంతో పెనవేసుకున్న నితీష్ కుమార్ తో కలసి కొత్త రాజకీయ జీవనం ప్రారంభించారు. ఈ విధంగా ఒకవిధంగా ఇద్దరు `పరాజితులు’ కలసి రాజకీయంగా ఇప్పుడు సరికొత్త యాత్ర చేపట్టారని చెప్పవచ్చు.

ఒకవంక నితీష్ కుమార్ పార్టీలో చేరి, వచ్చే లోక్ సభ ఎన్నికలలో పోటీకి సిద్దపడుతూ, మరోవంక జగన్ మోహన్ రెడ్డికి ఇక్కడ సలహాదారునిగా కుడా ప్రశాంత్ కొనసాగనున్నట్లు తెలిసింది. గత రెండేళ్లుగా మరే పార్టీ కుడా ఆయన సేవలకోసం ప్రయత్నం చేయక పోవడం గమనార్హం. దేశ చరిత్రలో మొదటిసారిగా ఒకే వ్యక్తి రెండు, మూడు పార్టీలలో రాజకీయ పాత్ర వహించే ప్రయత్నం చేస్తున్నారు.

2013గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, 2014  లోక్ సభ ఎన్నికలలో బిజెపి గెలుపుకు, 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో నితీష్ కుమార్ గెలుపుకు ప్రశాంత్ కిషోర్ ప్రచార వ్యుహాలే కారణమనే ప్రచారం జరుగుతున్నా వాస్తవానికి అందుకు తగిన ఆధారాలు లేవు. ఈ అంశాలపై విమర్శకులు కుడా లేకపోలేదు. ఎన్నికలలో ప్రజల మూడ్ ను బట్టి, గాలి ఎటు వీస్తుందో అటువైపు పనిచేసే నైపుణ్యం ప్రశాంత్ కు ఉన్నదని విమర్శకులు పేర్కొంటూ ఉంటారు.

2017లో యుపిలో కాంగ్రెస్ కు ఆయనతో ఎటువంటి ప్రయోజనం కలగక పోవడాన్ని ఈ సందర్భంగా ఆయన నైపుణ్యాన్ని వెల్లడి చేస్తుందని చెబుతూ ఉంటారు. బీహార్ లో కుడా `మహాకుటమి’లోని ఆర్ జే డి ఆయన సహాయం అవసరం లేదని త్రోసిపుచ్చింది. అయినా చెరిసగం పోటీ చేసినా, ఆ పార్టీకి జెడియు కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి.

వనరుల కొరత ఉన్నా ఆర్ జే డి 80 సీట్లు గెల్చుకోగా, చెప్పుకోదగిన నాయకుడు లేకపోయినా 41 సీట్లు పోటీ చేసిన కాంగ్రెస్ 27 సీట్లను గెల్చుకొంది. కాని జేడియు 71 సీట్లను మాత్రమె గెల్చుకొంది. కాంగ్రెస్ పోటీ చేసిన చాల సీట్లు బిజెపికి మంచి పట్టున్న పట్టణ ప్రాంత సీట్లు కావడం గమనార్హం. ఆర్ జే డి కన్నా తొమ్మిది సీట్లు తక్కువ రావడంతో తదుపరి కూటమి పక్షాలతో బెరసారాలలో నితీష్ వెనుక పడవలసి వచ్చింది. అదే కారణంగా ఇప్పుడు బిజెపితో సీట్ల కోసం బేరం చేయడంలో వేనుకబడుతున్నారు.

ప్రశాంత్ ను ఇతర పార్టీలతో పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతను అప్పచెప్పడం ద్వారా ముఖ్యంగా బిజెపితో బేరసారాలు ఆడే బాధ్యతను నితీష్ ఇప్పుడు అప్పచెప్పారు. మరోవిధంగా నితీష్ కు అంతటి ప్రాధాన్యత ఇవ్వడం జెడియు వర్గాలలోని నిరసనకు దారితీస్తున్నది. క్షేత్రస్థాయిలో పట్టు గల తమను విశ్వాసం లోకి తీసుకుకొండా క్షేత్రస్థాయి రాజకీయాలలో అనుభవం లేని ప్రశాంత్ కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పచెప్పడం పట్ల అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. ఈ సమస్యలను నితీష్ ఏవిధంగా దిగామిస్తారో చూడవలసి ఉంది.