పాక్, కాంగ్రెస్ మధ్య ఈ కెమిస్ట్రీ ఏంటో!

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శల దాడిని పెంచారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలు పాకిస్థాన్‌కు ఉపయోగపడుతున్నాయని, దీనిబట్టి కాంగ్రెస్ పరోక్షంగా పొరుగుదేశానికి సహాయపడుతున్నట్లు అర్థమవుతున్నదని విమర్శించారు. 

సోనిపట్ లో జరిగిన బీజేపీ ప్రచార సభలో ప్రసంగిస్తూ స్వచ్ఛ భారత్, సర్జికల్ స్ట్రైక్స్ లాంటి మాటలు వింటే కాంగ్రెస్ నేతలకు కడుపు నొప్పి వచ్చేస్తోందంటూ ఎద్దేవా చేశారు. ఇక పొరబాటున ఎవరైనా మన వాయుసేన సరిహద్దు దాటి వెళ్లి బాంబుల వర్షం కురిపించి నేలమట్టం చేసిన పాక్ ఉగ్రస్థావరం  బాలాకోట్ పేరెత్తితే వారిక నొప్పులతో విలవిలలాడుతూ చిందులు తొక్కుతారని అవహేళన చేశారు. 

పాకిస్థాన్ తరఫున ప్రపంచ వ్యాప్తంగా బలంగా తమ వాదన వినిపించడానికి కాంగ్రెస్ ను వాడుకుంటోందని ధ్వజమెత్తారు. పాక్, కాంగ్రెస్ మధ్య ఈ కెమిస్ట్రీ (ఆ బంధం) ఏంటో అర్థం కావడం లేదని  ప్రధాని ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్ నాయకుల ప్రకటనలను ఆధారంగా చేసుకుంటున్న పాక్.. భారత్‌పై విమర్శలకు దిగుతున్నదని తెలిపారు. 

హర్యానాలోని గొహనా, హిస్సార్‌లలో నిర్వహించిన ఎన్నికల సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు గురించి కాంగ్రెస్ నాయకులు ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. వారి ప్రకటనలు ఎవరికి ఉపయోగపడుతున్నాయో అన్న విషయం కూడా తెలుసు. అలాంటి ప్రకటనలతో ఎవరు లబ్ధిపొందుతున్నారో కూడా ప్రజలకు తెలుసు. ఇక్కడ ఉన్న మీకు కూడా అన్ని విషయాలు తెలుసు కదా? అని మోదీ ప్రశించారు.

దీంతో సభకు హాజరైన వాళ్లు పాకిస్థాన్ అనే గట్టిగా అరిచారు. వెంటనే స్పందించిన మోదీ అవును.. మీరు నిజం చెప్పారని పేర్కొన్నారు. తనపై విమర్శలు కురిపించడానికి కాంగ్రెస్ నాయకులు ఇలాంటి (ఆర్టికల్ 370 రద్దు గురించి) తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని, కానీ పాకిస్థాన్ ఈ ప్రకటనలను ఆధారంగా చేసుకొని అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.  

భారత్ ను అన్ని రంగాల్లోనూ హర్యానా గర్వంగా నిలబెట్టిందన్నారు ప్రధాని మోడీ. ఇక్కడి నుంచి వచ్చిన రెజ్లర్లు భారత్ కు మెడల్స్ సాధించి పెట్టారని, హర్యానా యువత భరతమాత సేవలో నిలిచి ఉగ్రవాదంపై పోరాడుతున్నారని ప్రశంసించారు. 

కానీ, కాంగ్రెస్ పాలనలో ఎవరికీ రక్షణ కల్పించలేకపోయారని, జవాన్లకు, రైతులకు, క్రీడాకారులకు కూడా భద్రత లేదని చెప్పారు. అన్ని రంగాల్లోనూ అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ పై ఆరోపణలు చేశారు. వచ్చే ఐదేళ్లలో 3.5 లక్షల కోట్లతో తాగు, సాగు నీటికి కొరత లేకుండా చేయాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. 2024 కల్లా రైతులు, మహిళలకు కష్టాలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.