ఆర్టీసీ ఆస్తుల లీజు ప్రక్రియను నిలిపివేయండి

ఆర్టీసీకి చెందిన భూములను ప్రైవేట్ ఏజన్సీలకు లీజుకు ఇవ్వకుండా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కోరారు. లక్ష్మణ్ ఆధ్వర్యంలోని బీజేపీ నేతల బృందం గవర్నర్‌ను కలిసి ఆర్టీసీ కార్మికులతో రాష్ట్రప్రభుత్వం చర్చలు జరిపేందుకు చొరవ తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ మేరకు వారు వినతిపత్రం సమర్పించారు. 

ఆర్టీసీకి రాష్ట్రంలో రూ.80వేల కోట్ల విలువైన 1500 ఎకరాల భూములు ఉన్నాయి. నగరాలు, పట్టణాల్లో వ్యాపార కూడళ్లలో ఉన్న ఈ ఆస్తులను ప్రైవేట్‌పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కార్మిక సంఘాలు తమ దృష్టికి తెచ్చాయని పేర్కొన్నారు. లీజుకు ఇచ్చేందుకు తగిన నిబంధనలను పాటించడం లేన్నారు. రాజధానిలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో పది ఎకరాల విలువైన భూమిని 33 ఏళ్లపాటు ప్రైవేట్ ఏజన్సీకి ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. 

రూ.76 కోట్ల విలువైన నాలుగు ఎకరాల భూమిని అధికార పార్టీకి చెందిన ఒక రాజకీయనేతకు అప్పగించారని ఆరోపించారు. వరంగల్‌లో రాంనగర్ పాత బస్టాండ్ వద్ద రూ.25 కోట్ల విలువైన భూమిని ప్రైవేట్ ఏజన్సీకి ఇచ్చారని, ఆర్మూరులో ఏడు వేల చదరపు గజాల భూమిని అధికార పార్టీకి చెందిన రాజకీయ పార్టీలకు ఇచ్చారని వివరించారు. కరీంనగర్ నగరంలో 66 ఎకరాల భూమిని వంద సంవత్సరాలకు లీజుకు ఇచ్చారని చెప్పారు. 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి చెందిన స్థలాల్లో వంద పెట్రోలు పంపులు ఏర్పాటు చేసేందుకు పెట్రోలియం కార్పోరేషన్లతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఒక వ్యక్తికి 54 పెట్రోలు పంపులు ఏర్పాటు చేసేందుకు భూమిని ఇచ్చారని ఆరోపించారు. ఆర్టీసీకి వచ్చే లాభాలన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఆర్టీసీకి రూ.2200 కోట్ల మేర ప్రభుత్వం బకాయి పడిందని చెబుతూ కార్మికులకు చెందిన రూ.1200 కోట్ల ప్రావిడెంట్ ఫండ్‌ను కూడా ప్రభుత్వం దారి మళ్లించిందని విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరితో నిరాశతో శ్రీనివాసరెడ్డి, సురేందర్ గౌడ్ అనే ఇద్దరు కార్మికులు ఆత్మహుతికి పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు.