రెండు దశాబ్దాలుగా రెండు కుటుంబాల పాలన  

ఆంధ్ర ప్రదేశ్ లో రెండు దశాబ్దాల కాలంగా రాష్ట్రంలో రెండు కుటుంబాల పాలన సాగుతోందని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు వై సుజనా చౌదరి  ధ్వజమెత్తారు. భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు మహాత్మగాంధీ సంకల్ప యాత్రను నూజివీడులో  మాజీ శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య ఆధ్వర్యంలో ప్రారంభిస్తూ  జాతీయ వాదంతోనే రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి చెందుతాయని చెప్పారు. ప్రాంతీయ పార్టీలతో అభివృద్ధి అంతంతమాత్రంగా ఉంటుందని స్పష్టం చేశారు. .

1983లో నాటి రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ఎన్టీ రామారావు టీడీపీని ఏర్పాటు చేసి అనతికాలంలోనే అధికారంలోకి వచ్చారని గుర్తు చేస్తూ, నాడు జాతీయ భావం కరువైన పరిస్థితుల్లో టీడీపీ విజయం సాధించిందని చెప్పారు.

రాష్ట్ర విభజన అనంతరం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయల నిధులు ఇచ్చి ఆదుకుందని, అయితే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కేంద్రంపై తిరుగుబాటు చేయటంతో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని విచారం వ్యక్తం చేశారు. 

నేడు అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వంతో ప్రజలు అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని, వైసిపి  విజయానికి కృషి చేసిన వారే నేడు తలలు పట్టుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక దిశా నిర్దేశం లేకుండా పోయిందని విమర్శించారు. 

ప్రస్తుతం జాతీయ వాదంతోనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుందని స్పష్టం చేశారు.  2024లో జరిగే ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోని వస్తుందని, దీనికి పార్టీలోని ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.