హేళనగా మాట్లాడిన వారిని చరిత్ర క్షమించదు 

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుపై హేళనగా మాట్లాడిన వారిని చరిత్ర క్షమించదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీడ్‌ జిల్లాలోని పర్లీ నియోజకవర్గంతోపాటు పుణె, సతారాలో ఆయన ప్రచారం నిర్వహిస్తూ  ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, ఎన్సీపీలపై మండిపడ్డారు.

‘ఆర్టికల్‌ 370 రద్దు అనేది ఓ వ్యక్తిని హత్యచేయడం లాంటిదంటూ కొందరు కాంగ్రెస్‌ నేతలు అన్నారు. ఈ చర్య దేశానికి విపత్తు వంటిదని, కశ్మీర్‌ను వదులుకోవాల్సి వస్తుందంటూ.. ఇలా చాలా మాట్లాడారు. అలా జరిగిందా? కశ్మీర్‌ను పొగొట్టుకున్నామా? మీరు కశ్మీర్‌కు వెళ్తానంటే ఏర్పాట్లు చేస్తా. ఆర్టికల్‌ 370రద్దుపై హేళనగా మాట్లాడిన వారిని చరిత్ర క్షమించదు' అంటూ మండిపడ్డారు. 

కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పే అవకాశం మహారాష్ట్ర తలుపుతట్టింది. మీ దేశభక్తిపై నాకు అపార నమ్మకం ఉన్నది. జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి తగిన బుద్ధి చెబుతారని తెలుసని మోదీ భరోసా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రతిపక్షాల స్వార్థ ప్రయోజనాలకు మధ్య జరుగుతున్న పోరాటంగా అసెంబ్లీ ఎన్నికలను ప్రధాని అభివర్ణించారు.

21వ శతాబ్దానికి చెందిన భారత్‌ ప్రస్తుత పరిస్థితుల వద్ద ఆగబోదని, మార్పులకు భయపడబోదని తెలిపారు. జాతీయవాదం, జాతీయ భద్రత అంశాల్లో ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విధానాలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, భారత్‌పై తప్పుడు ధోరణిలో వ్యవహరించేవారికి గట్టిగా బుద్ధ్దిచెబుతామని హెచ్చారించారు. మహారాష్ట్రలో ఈసారి కమలం మరింతగా వికసిస్తుందని, ఫలితాలు రికార్డులను బద్దలు కొడతాయని ధీమా వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్‌, ఎన్సీపీ ఒకరిపై ఒకరు పోట్లాడుకుంటున్నారని, అందుకే యువ నాయకులు ఆయా పార్టీలను వీడుతున్నారని విమర్శించారు. అలిసిపోయామని ప్రతిపక్షాల సీనియర్లు అంటున్నారని, అలిసిపోయినవారు ప్రజలకు సేవ చేయగలరా? అంటూ కాంగ్రెస్‌ నేత సుశీల్‌ షిండే ఇటీవల చేసిన వ్యాఖ్యలకు మోదీ కౌంటర్‌ ఇచ్చారు.