ఎడిబి రుణాలను దారిమళ్లించిన జగన్ ప్రభుత్వం 

నిర్ధిష్ట అవసరాలకు ఇచ్చిన రుణాలు సైతం ఏపీలో పక్కదోవ పడతున్నాయి. ఆర్థిక వనరులు అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో మ్యాచింగ్‌ మొత్తాన్ని జమ చేయలేక, రుణాన్ని కూడా ఇతర అవసరాలకు మళ్ళిస్తున్నారు. ఆ జాబితాలో విదేశీ రుణాలు చేరాయ. విశాఖ- చెన్నై పారిశ్రామిక క్యారి డార్‌ నిర్మాణానికి ఎసియన్‌ డెవలప్‌మెంటు బ్యాంకు (ఎడిబి) ఇచ్చిన రుణాలు ఇలా పక్కదోవ పట్టిన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. 

గత ప్రభుత్వ హయంలోనే ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా పరిస్థితిలో మార్పు కనపడలేదు. దీంతో తాము పనులు చేయలేమంటూ కొంతమంది కాంట్రాక్టర్లు ఒప్పందాలను రద్దు చేసుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కేంద్రం కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. 

రాష్ట్రంలో నిర్మిస్తున్న విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు ఏషియన్‌ డెవలప్‌మెరట్‌ బ్యారకు దాదాపు రూ 2600 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఇరదులో రూ 960 కోట్లను (134 మిలియన్‌ డాలర్లు) విడుదల కూడా చేసింది. ఈ నిధులతో ఇప్పటికే రూ 500 కోట్ల  వరకు పనులు జరగాలన్నది లక్ష్యం. ఇందులో రూ 350 కోట్ల పనులను కాంట్రాక్టర్లు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. 

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు మాత్రం కొన్ని నెలలుగా చెల్లించడంలేదని ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో గుర్తించారు. దీనిపై పరిశీలన చేయగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా చెల్లించకపోవడంతో పాటు, విడుదల చేసిన మొత్తాన్ని కూడా ఇతర అవసరాలకు మళ్లించినట్లు తేలింది. 

దీంతో కాంట్రాక్టర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.  ఇక పనులు చేయలేమని, తమను తొలగించమంటూ ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు.