బీహార్ కూటమి బాధ్యత నితీష్ కుమార్ దే 

వ‌చ్చే ఏడాది జరగనున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ-జేడీయూ కూట‌మి నాయకత్వ బాధ్యతలను సీఎం నితీశ్ కుమారే చేప‌డతార‌ని కేంద్ర హోంమంత్రి, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. బిహార్‌ ఎన్నికలను నితీశ్‌ నాయకత్వంలోనే ఎదుర్కొంటామని, 2020 తర్వాత కూడా ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని షా తేల్చి చెప్పారు. 

 రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ  కలిసి పోటీ చేస్తాయని చెబుతూ తమ కూట‌మిలో విబేధాలు ఉన్నాయ‌న్న వార్త‌ల‌ను ఆయ‌న కొట్టిపారేశారు. బిహార్‌లో ప్రస్తుతం జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోంది. అయినా, ఇరుపార్టీల నేతలు అప్పుడప్పుడు మిత్రపక్షంపై అసంతృప్తి వెళ్లగక్కుతూ వ్యాఖ్యలు చేశారు. 

ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ-బీజేపీ కూటమి కొనసాగుతుందా? నితీశ్‌ నాయకత్వంలో ఎన్నికలను ఎదుర్కొనేందుకు కమలదళం సిద్ధంగా ఉందా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. నితీశ్‌ను పక్కనబెట్టి.. బీజేపీ సొంతంగా పోటీ చేస్తుందన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. ఈ ఊహాగానాలకు అమిత్‌ షా తెరదించారు.