ఇద్దరు మంత్రులపై అవినీతి మచ్చ... జగన్ వార్నింగ్ 

అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులను  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హెచ్చరించినట్లు తెలిసింది. మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, పద్ధతి మార్చుకోవాలని తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. బుధవారం జరిగిన రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. అయితే ఆ ఇద్దరి మంత్రుల పేర్లు చెప్పలేదు. 

అవినీతికి తావులేకుండా రాష్ట్రంలో నాలుగు నెలలుగా పరిపాలన సాగుతోందన్న సిఎం కొందరిపై అవినీతి ఆరోపణాలు వస్తున్నాయని చెప్పారు. సిఎం చేసిన వాఖ్యాలతో మంత్రులందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ గుసగుసలాడారు. ఆరోపణలు వచ్చిన మంత్రులను పిలిచి చెబుతానని, సరిదిద్దుకోవాలని సిఎం చెప్పినట్లు సమాచారం. చిన్న అవినీతి జరిగినా పెద్దదిగా చేయడానికి ప్రతిపక్ష పార్టీలు చూస్తున్నాయని, మంత్రులపై ఆరోపణాలు వస్తే సహజంగానే తనపై కూడా ఒత్తిడి పెరుగుతుందని అన్నట్లు తెలిసింది. 

ఒత్తిడి పెరిగితే వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, తరువాత బాధపడ్డా ప్రయోజనం లేదని హెచ్చరించినట్లు సమాచారం. ఉన్న ఎమ్మెల్యేలలో మంచివారని ఏరికోరి మంత్రివర్గంలో తీసుకున్నానని, బాగా పనిచేస్తే అందరికీ మంచి పేరు వస్తుందన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, తిరిగి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఓట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు కూడా ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరగాలని, పార్టీ అని చూడొద్దని చెప్పినట్లు తెలిసింది.