కాంగ్రెస్‌లో ఒక కుటుంబ భక్తే దేశభక్తి  

ఓ కుటుంబం పట్ల చూపే భక్తినే కాంగ్రెస్‌ పార్టీ దేశభక్తిగా భావిస్తుందని, ప్రతిపక్షం ‘కొన ఊపిరి’తో కొట్టుమిట్టాడుతున్నదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. హిందూత్వ సిద్ధాంతకర్త వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ విలువలే జాతి నిర్మాణానికి ఆధారాలని స్పష్టం చేశారు. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌కు భారతరత్న ఇచ్చేందుకు గత (కాంగ్రెస్‌) ప్రభుత్వం నిరాకరించిందని ఆరోపించారు. 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ బుధవారం అకోలా, జాల్నా జిల్లాల్లో జరిగిన సభల్లో మాట్లాడుతూ, సావర్కర్‌ చూపిన విలువల కారణంగానే తాము జాతి నిర్మాణానికి జాతీయవాదాన్ని ఆధారంగా చేసుకున్నామని తెలిపారు. సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ బీజేపీ మహారాష్ట్ర శాఖ ప్రతిపాదించిన మరునాడే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాంగ్రెస్‌ పార్టీ కొన ఊపిరితో ఉన్నదని, ఆ పార్టీ నేతలు ఓ కుటుంబం పట్ల చూపే భక్తినే దేశభక్తిగా భావిస్తారని ఎద్దేవా చేశారు. 

‘కాంగ్రెస్‌ పార్టీ తమ కార్యకర్తలకు జాతీయవాదంపై ఒక క్లాస్‌ తీసుకుంటుందని విన్నా. నాకు నవ్వాలో.. ఏడ్వాలో తెలియడం లేదు. స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్‌ ఇది కాదని దీన్ని బట్టి రుజువవుతున్నది’ అని ధ్వజమెత్తారు. జాతీయవాద భావాలు, దేశభక్తి మహారాష్ట్రలో ఉచ్ఛస్థితిలో ఉంటాయన్న విషయం కాంగ్రెస్‌, ఎన్సీపీ మరిచిపోయాయని దయ్యబట్టారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దును ప్రతిపక్షాలు విమర్శించడం సిగ్గుచేటని మోదీ మండిపడ్డారు.

‘జమ్ముకశ్మీర్‌కు, మహారాష్ట్రకు సంబంధం లేదని వారు ఎలా అనగలరు? ఇటువంటి ఆలోచనలున్నందుకు వారు సిగ్గుపడాలి. నీటిలో మునిగి చావాలి’ అని పేర్కొన్నారు. దేశ భద్రతపై జాతి అంతా ఒకే స్వరం వినిపించాలని చెప్పారు. కానీ ప్రతిపక్షాలు అన్ని విషయాల్లోనూ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌-ఎన్సీపీ కూటమిని ఆయన అవినీతి కూటమి అని అంటూ వాటిపాలనలో మహారాష్ట్ర దశాబ్దం వెనుకకు పోయిందని విమర్శించారు. 

వారి పాలనలో నిత్యం రైళ్లు, బస్సులు, భవనాల్లో బాంబు పేలుళ్లు సంభవించేవని గుర్తు చేశారు. ఈ పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు కాంగ్రెస్‌-ఎన్సీపీ అధికారంలో ఉండగానే వేర్వేరు దేశాలకు తప్పించుకొనిపోయి అక్కడే స్థిరపడ్డారని చెప్పారు. దేశభక్తి ఉన్నవారెవరూ పాక్‌పై జరిపిన లక్షిత దాడులు, వైమానిక దాడులను వ్యతిరేకించరని, కానీ ఈ సిగ్గులేని నేతలు ఆ పనిచేశారని ఎన్సీపీ నేతలనుద్దేశించి మోదీ విమర్శించారు. 

ఎన్సీపీ ఎన్నికల చిహ్నమైన గడియారంలో టైమ్‌ 10 గంటల 10 నిమిషాలు చూపుతుందని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎన్సీపీకి పదేసి సీట్లు మాత్రమే వస్తాయని మోదీ జోస్యం చెప్పారు.