పతనం అంచున జెడిఎస్ – కాంగ్రెస్ సంకీర్ణం !

కర్ణాటకలో నాలుగు నెలల వయస్సున్న జేడీఎస్- కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కానున్నదన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలంతా బుధవారం నాటికి బెంగళూరుకు చేరుకోవాలని బీజేపీ ఆదేశించడంతో ఊహాగానాలకు బలం చేకూరింది. అక్రమ, రాజ్యాంగ విరుద్ధ మార్గాల్లో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ఆరోపించింది. ఈ ఆ ఆరోపణలను బీజేపీ కొట్టి పారేసింది. కూటమి సర్కార్ తనంతటతానే కూలిపోతుందన్నదని పేర్కొన్నది.

కొందరు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు భారీగా డబ్బును, మంత్రి పదవులను ఇస్తామని బీజేపీ ఆరోపణలు చేస్తుండగా, మరోవంక కొద్దిమంది బిజెపి ఎమ్యెల్యేలను తమవైపుకు తిప్పుకొనేందుకు కుమారస్వామి ప్రయత్నిస్తున్నట్లు కధనాలు వెలువడ్డాయి. తమ ప్రభుత్వాన్ని కాపాడు కొనేందుకు జేడీఎస్-కాంగ్రెస్ కూటమి నేతలు ప్రత్యామ్నాయ వ్యూహ రచన కోసం వరుస భేటీలు జరుపుతున్నారు.

12 రోజుల ఐరోపా పర్యటన ముగించుకుని బెంగళూరుకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు నిర్వహించారు. బీజేపీ వలలో పడొద్దని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు గుల్బర్గాలో హైదరాబాద్-కర్ణాటక విముక్తి దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి  హెచ్‌డీ కుమారస్వామి మాట్లాడుతూ బీజేపీ మరోసారి రిసార్ట్ రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఎలాగైనా అధికారంలోకి రావడం కోసం అనైతిక, అక్రమ మార్గాలను అనుసరిస్తున్నట్లు విమర్శలు గుప్పించారు.

“మా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు యడ్యూరప్ప మాఫియా మనుషులను నియమించారు” అని ఆరోపించారు. జేడీఎస్ సీనియర్ ఎమ్మెల్యే హెచ్‌కే కుమారస్వామి భార్య చంచల మాట్లాడుతూ తన భర్త వద్దకు ఇద్దరు బీజేపీ నేతలు వచ్చి రూ.30 కోట్ల నగదు, మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు.

మంత్రి డి కే శివకుమార్, ఎమ్యెల్యే లక్ష్మి హేబ్బల్కర్ లతో ఏర్పడిన వివాదంతో బెలగావి సోదరులు తిరుగుబాటు ధోరణులు ప్రదర్శించడం పార్టీకి తలనొప్పిగా మారింది. వారిని సముదాయించే బాధ్యతను పార్టీ సిద్దరామయ్యకు అప్పచెప్పింది. మంత్రి రమేష్ జర్కిహోలి, శాసన సభ్యుడైన ఆయన సోదరుడు సతీష్ లను పిలిపించి మాట్లాడిన ప్రయోజనం లేకపోయింది. తమ జిల్లా వ్యవహారాలలో శివకుమార్ జోక్యం చేసుకోరాదని, తాము చెప్పిన అధికారులను బదిలీ చేయాలని, తమ వర్గానికి మరో మంత్రి పదవితో పాటు కొన్ని అధికార పదవులు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రమేష్ అయితే ఉపముఖ్యమంత్రి పదవినే కోరుతున్నారు.

తమతో డజన్ మంది శాసన సభ్యులు ఉన్నారని ఈ సోదరులు చెబుతున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చక పోతే బిజెపి వైపుకు వెడతామని బెదిరిస్తున్నారు. కనీసం ఆరుగురినైనా వారు చీల్చే అవకాశం ఉన్నదని బిజెపి ఎదురు చూస్తున్నది. ఈ సోదరులే సంకీర్ణ ప్రభుత్వ పతనానికి కారణం కాగలరని భావిస్తున్నది. మరి కొందరు శాసన సభ్యులు సహితం తమ జిల్లాల్లో అధికారులు తమ మాటలను వినడం లేదని, జెడిఎస్ నేతలే పెత్తనం చేస్తున్నారని అంటూ సిద్దరామయ్యకు ఫిర్యాదు చేసారు. పైగా ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వరన్ వ్యవహారశైలి పట్ల కుడా విమర్శలు చెలరేగుతున్నాయి. ఆయిన ముఖ్యమంత్రి కుమారస్వామికి వంత పాడుతున్నారని, కాంగ్రెస్ సభ్యుల ప్రయోజనాలను పట్టించు కోవడం లేదని వాపోతున్నారు.

ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న బిజెపి నాయకత్వం ముందుగా తమ ఎమ్మెల్యేలు ఎవ్వరు జారిపోకుండా జాగ్రత్త పడుతున్నది. ఎటువంటి పరిస్థితులు సంభవించినా అవకాశాలను అందిపుచ్చు కోవాలని సిద్దపడుతున్నది. కనేసం 15 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర బిజెపి అద్యక్షుడు యడ్డ్యురప్పకు అందుబాటులో ఉన్నట్లు కధనాలు వెలువడడంతో సంకీర్ణ ప్రభుత్వంలో వణుకు ప్రారంభమైనది.

అయితే సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం తాము ప్రయత్నం చేస్తున్నామన్న ముఖ్యమంత్రి ఆరోపణలను యడ్డ్యురప్ప కొట్టిపారవేసారు. తమ శాసన సభ్యులపై ఆ రెండు పార్టీలకు అదుపు లేదని, అందుకనే ప్రతిపక్షాన్ని చూసి భయపడుతున్నారని విమర్శించారు. నిరాదర ఆరోపణలతో కాలం గడపకుండా అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి హితవు చెప్పారు.

మరోవంక బిజెపి బుధవారం విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ ఎమ్యెల్యేలు, ఎమ్యేల్సిలు, ఎంపిలతో పాటు పార్టీ నేతలు – సుమారు 450 మందిని ఈ సమావేశానికి ఆహ్వానించింది. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను సమీక్షించడంతో పాటు భవిష్యత్ వ్యుహలకు పదును పెట్టె పవకాశం ఉంది.