టీడీపీ, వైసీపీలు దొందూదొందే  

రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్ కుటుంబాల మధ్యే అధికారం ఉందని పేర్కొంటూ టీడీపీ, వైసీపీలు దొందూదొందే అని  మాజీ కేంద్ర మంత్రి, బిజెపి నేత సుజనా చౌదరి విమర్శించారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో గాంధీ సంకల్పయాత్రను ప్రారంభిస్తూ  దేశంలో ప్రస్తుతం ప్రాంతీయ వాదానికి కాలం చెల్లిందని స్పష్టం చేశారు. 

ప్రాంతీయ పార్టీలతో ప్రయోజనం లేదని చెబుతూ అందరూ జాతీయవాదానికి మద్దతు ఇవ్వాలని పిలునిచ్చారు. తాను ప్రాంతీయ వాదానికి గతంలో తాను మద్దతు ఇచ్చిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూ జాతీయవాదమే స్థిరమైనదని నేడు అనుభవంలోకి వచ్చిందని చెప్పుకొచ్చారు. 

దేశంలో అధికార వికేంద్రీకరణ, గ్రామ స్వరాజ్యం గాంధీ ఆశయమని గుర్తు చేస్తూ  ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఆశయ సాధనకోసం కృషి చేస్తోందని తెలిపారు. గ్రామ గ్రామాన ఈ ఆశయ సాధన లక్ష్యంగానే గాంధీ సంకల్పయాత్ర చేపట్టినట్లు చెప్పారు. 

కాగా, మహాత్మాగాంధీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోదీకే దక్కుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కర్నూలులో తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు పరిధిలో 150 కిలోమీటర్ల మహాత్మాగాంధీ సంకల్పయాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. 2014లో ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్రమోదీ ఇప్పటి వరకు దేశాభివృద్ధికి ఎంతో చేశారని పేర్కొంటూ మోదీ ప్రధానమంత్రిగానే కాకుండా దేశ రక్షణ విషయంలో కాపలాదారుగా రాజీపడకుండా దృఢనిశ్చయంతో పనిచేస్తున్నారని కొనియాడారు. 

రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ సిద్ధాంతాలయిన అహింస, అంటరానితనాన్ని నిర్మూలించడం, ఖాదీవస్త్రాలు ధరించడం, పరిసరాల పరిశుభ్రత, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండటం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యవంతులను చేస్తామని వివరించారు. రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులను త్వరితగతిన ఖర్చు చేసి ఆయా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఎంపీ కోరారు.