ప్రఫుల్‌ పటేల్‌కు ఈడీ సమన్లు  

 కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ సీనియర్‌ నేత ప్రఫుల్‌ పటేల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేసింది. డ్రగ్‌ స్మగ్లర్‌ ఇక్బాల్‌ మిర్చీ మొదటి భార్య హజ్రా మేమన్‌తో పటేల్‌కున్న ఆస్తి లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్న ఈడీ.. శుక్రవారం విచారణకు హాజరు కావాలని సదరు సమన్లలో స్పష్టం చేసింది. ఇక్బాల్‌ మిర్చీ 2013లో లండన్‌లో చనిపోయిన విషయం తెలిసిందే. అంతేగాకుండా అంతర్జాతీయ ఉగ్రవాది, అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు సన్నిహితుడు కూడా.

కాగా, మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న యూపీఏ ప్రభుత్వ హయాంలో పటేల్‌ పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో హజ్రా, పటేల్‌ మధ్య జరిగిన డీల్‌లో క్విడ్‌ ప్రోకో ఆరోపణలపై ఈడీ మనీ లాండరింగ్‌ దర్యాప్తు చేస్తున్నది. తీవ్రవాదులకు నిధులు అందాయా? అన్న కోణంలోనూ విచారణ చేపడుతున్నది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పటేల్‌ వ్యవహారం మాత్రం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ ఎన్నికల్లో నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)తో కలిసి కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేస్తున్నది.

అయితే, గ్యాంగ్‌స్టర్‌ ఇక్బాల్‌ మిర్చీతో ముంబైలో తాను డీలింగ్స్‌ చేశానన్న వార్తలు కేవలం ఊహాగానాలేనని పటేల్‌ కొట్టిపారేశారు. ‘ఏవో కొన్ని డాక్యుమెంట్లు లీకైనట్లున్నాయి. మీరు జర్నలిస్టులు కాబట్టి వాటిపై సహజంగానే ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు’ అని విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ప్రఫుల్‌ పటేల్‌కు చెందిన మిల్లేనియం డెవలపర్స్‌.. ముంబైలోని వొర్లీలోగల సీజే హౌజ్‌ను 2005లో రీడెవలప్‌ చేసిందని, 2007లో దీనిలోని రెండు అంతస్తులను హజ్రాకు బదిలీ చేశారని ఈడీ చెబుతున్నది. 

‘మిల్లేనియం డెవలపర్స్‌ మా కుటుంబానిదే. ఇందులో ఎవరికీ భాగస్వామ్యం లేదు. అలాగే హజ్రా మేనన్‌కు పటేల్‌ కుటుంబానికి మధ్య నయా పైసా విలువైన ఆస్తి లావాదేవీ కూడా జరుగలేదు’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై దర్యాప్తు జరుగుతున్నదన్న ఆయన ‘సీజే హౌజ్‌లోని ఓ వ్యక్తితో నాకూ సంబంధాలు ఉన్నాయా? లేవా? అన్న కోణంలోనే విచారణ చేస్తుండవచ్చని పరోక్షంగా హజ్రాతో ఉన్న సంబంధాల ఆరోపణలపై వ్యాఖ్యానించారు. 

1970లో నిర్మించిన సీజే హౌజ్‌లోగల 21 మంది కో-ఓనర్ల మధ్య విభేదాలు ఏర్పడ్డాయని 1978 నుంచి 2005 వరకు బాంబే హైకోర్టు రిసీవర్‌ వద్దే ఈ ఆస్తి ఉందని ఈ సందర్భంగా పటేల్‌ గుర్తుచేశారు. 

కాగా,  పటేల్‌, హజ్రా మధ్య జరిగిన ఆస్తి లావాదేవీని రాజద్రోహంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అభివర్ణించారు. ముంబై పేలుళ్ల నిందితుడు ఇక్బాల్‌ మిర్చీ భార్యతో ఓ కేంద్ర మంత్రికి డీలింగ్స్‌ ఏమిటీ? అని ప్రశ్నించారు. దీనికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఈడీ చర్య లు తీసుకుంటుందని చెప్పారు. 

బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర స్పందిస్తూ డీల్‌పై పటేల్‌, హజ్రా సంతకాలు ఉన్నాయని ఆరోపించారు. కేంద్ర క్యాబినెట్‌లో పటేల్‌ను చేర్చుకోవడానికి సోనియా గాంధీ క్విడ్‌ ప్రోకోకు పాల్పడ్డారా? అని ప్రశ్నించారు.