జాతి గర్వించదగ్గ వ్యక్తి కలాం  

దివంగత.. భారత మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం జాతి గర్వించదగ్గ వ్యక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడరు. ఇవాళ కలాం జయంతి. ఆయన జయంతి సందర్భంగా ప్రధాని.. కలాం జ్ఞాపకాలను ట్విట్టర్ ద్వారా నెమరువేసుకున్నారు. రక్షణ రంగంలో కలాం చేసిన కృషి ఎన్నటికీ మరిచిపోలేమని చెప్పుకొచ్చారు. 

రాష్ట్రపతిగా ఆయన దేశానికి చేసిన సేవలు ఆదర్శనీయం. ఎంత ఉన్నతమైన స్థానాలు అధిరోహించినప్పటికీ.. ఆయన సాధారణ జీవితం గడిపారనీ, వ్యక్తిగతంగా ఎలాంటి ఆస్తులు సంపాదించుకోలేరని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు. పుస్తకాలే ఆయన ఆస్తి అని మోదీ పేర్కొన్నారు. ఆయనను కలుసుకున్న క్షణాలు తన  మనసులో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. భారత్ రక్షణరంగంలో బలపడడానికి ప్రధాన వ్యక్తి కలాం అని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. 

ఢిల్లీలోని డిఆర్‌డిఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గ్) భవన్‌లోమాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఘనంగా జరిగింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఐఎఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్ కేఎస్ భదౌరియా, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.