బాబు కాంగ్రెస్ తో ఎందుకు చేతులు కలిపారో !

రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ నుంచి బయటికొచ్చామని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో ఎందుకు చేతులు కలపాల్సి వచ్చిందో చెప్పాలని బీజేపీ ఉపాధ్యక్షుడు ఎస్‌.విష్ణువర్దన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికలో తెలుగుదేశం కాంగ్రెస్‌తో చేతులు కలిపి తెలుగు వారి ఆత్మ గౌర వాన్ని తాకట్టు పెట్టిందని దుయ్యబట్టారు.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్‌టీఆర్‌ టీడీపీని స్థాపించారని, ఇప్పుడు ఆ పార్టీతోనే చేతులు కలపడంతో ఆయన ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఏపీని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి ఖర్చు చేసిన నిధులపై కాంగ్రెస్, టీడీపీ రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని స్పష్టం చేసారు.

కాగా, బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుపై  టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. జీవీఎల్‌ 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులు బహిరంగ చర్చకు రావాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఉమామహేశ్వర రాజు సవాల్‌ చేశారు. టీడీపీకి దమ్ముంటే సీబీఐతో విచారణ కోరాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ‍ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. జీవీఎల్‌పై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధావెంకన్న చరిత్ర ప్రజలకు తెలుసునని విమర్శించారు.

టీడీపీ ప్రభుత్వానికి బీసీలంటే గిట్టదని ఉమామహేశ్వర రాజు విమర్శించారు. బీసీ అయినందునే దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు సూర్యలతను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యలతపై నిర్వహించిన విచారణ నివేదికను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. మంత్రి లోకేష్‌ కోసం తాంత్రిక పూజలు చేయడం వల్లే నివేదిక బయటకు రాకుండా చేశారని ఆరోపించారు. తాంత్రిక పూజల విషయంలో లోకేష్‌పై ఆరోపణలు వచ్చినప్పడు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. పూజలు చేయించిన ఈఓ సూర్యకుమారికి మంచి పోస్టింగ్‌ ఇచ్చారని వెల్లడించారు.