అమరావతి బాండ్లుతో మరో రూ 500 కోట్లు

అమరావతి బాండ్లు పేరుతో రూ. 2,000 కోట్లు అప్పు చేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు సీఆర్‌డీఏ ద్వారా మరో రూ. 500 కోట్ల అప్పు చేయించాలని నిర్ణయించింది. బాండ్ల అమ్మకం వివాదాస్పదంగా మారడంతో ఈ సారి పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లబోతోంది. ఈ అప్పు చేసేందుకు లీడ్‌ మేనేజర్‌ను ఎంపిక చేసేందుకు సీఆర్‌డీఏ ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను ఆహ్వానించింది.

ముగ్గురు మర్చంట్‌ బ్యాంకర్లతో లీడ్‌ మేనేజర్‌ను నియమించాలని ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులో సీఆర్‌డీఏ స్పష్టం చేసింది. లీడ్‌ మేనేజర్‌ ఫీజును దరఖాస్తుల ద్వారా తెలియజేయాల్సిందిగా సీఆర్‌డీఏ తెలిపింది. ఎంపిక చేసిన లీడ్‌ మేనేజర్‌ దళారిగా వ్యవహరిస్తారు. ఇటీవల అమరావతి బాండ్లు జారీచేసిన సమయంలో దళారీగా వ్యవహరించిన సంస్థకు రూ. 17 కోట్లను సీఆర్‌డీఏ చెల్లించిన విషయం తెలిసిందే.

ఇదే తరహాలో అమరావతి బాండ్లు పబ్లిక్‌ ఇష్యూ లీడ్‌ మేనేజర్‌కు కూడా ఫీజు రూపంలో సీఆర్‌డీఏ చెల్లించనుంది. అమరావతి బాండ్లు పబ్లిక్‌ ఇష్యూకు అవసరమైన అన్ని ఏర్పాట్లను లీడ్‌ మేనేజర్‌ చేయాల్సి ఉంటుంది. ఒకే విడత గానీ లేదా రెండు మూడు విడతల్లో గానీ బాండ్లు ద్వారా పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లనున్నట్లు సీఆర్‌డీఏ పేర్కొంది. ఈ బాండ్లు కాలపరిమితి మూడేళ్ల నుంచి 15 ఏళ్ల వరకు ఉంటుందని తెలిపింది.

లీడ్‌ మేనేజర్‌ ఎంపిక కోసం బిడ్లు దాఖలకు వచ్చే నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు. అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు బిడ్లు తెరవనున్నట్లు సీఆర్‌డీఏ పేర్కొంది. ఇందుకు సంబంధించి ఈ నెల 25వ తేదీన ప్రీబిడ్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఆర్‌డీఏ పేర్కొంది.

అమరావతి బాండ్లు పేరిట పబ్లిక్‌ ఇష్యూ ద్వారా జారీ చేసే బాండ్లను ఎవ్వరైనా వ్యక్తులు, సంస్థలు కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. ఇటీవల సీఆర్‌డీఏ రూ. 2000 కోట్లు అప్పునకు జారీ చేసిన బాండ్లకు 10.32 శాతం వడ్డీని నిర్ణయించిన విషయం తెలిసిందే. పెద్ద మొత్తంలో వడ్డీ ఇవ్వడంతో పాటు అసలుకు, వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. దీంతో అప్పు ఇచ్చేందుకు ఆర్థిక సంస్థలు ముందుకు వచ్చాయి.

ఒక పక్కన వాణిజ్య బ్యాంకుల్లో 8 నుంచి 9 శాతం వడ్డీకి అప్పులు పుడుతుంటే అమరావతి బాండ్ల పేరుతో అత్యధికంగా 10.32 శాతం వడ్డీకి అప్పు తేవడంపై పలు విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయినా సరే ఇప్పుడు మరోసారి అమరావతి బాండ్లు పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లాలని సీఆర్‌డీఏ నిర్ణయించడం గమనార్హం.