పోలవరం పూర్తి బాధ్యత కేంద్రానిదే 

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరలో పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ భరోసా ఇచ్చారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు రివర్స్‌ టెండరింగ్‌ విధానంతో సహా ఇతర అంశాలకు సంబంధించిన వివరాలేమీ కేంద్రం వద్ద లేవని విస్మయం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందనా లేదని విచారం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ స్పందనను బట్టి కేంద్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో బీజేపీ నేతలు రెండు రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టు పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన విషయం తెలిసిందే.

ఆదివారం రాత్రి 9 గంటలకు ఢిల్లీలోని మంత్రి షెకావత్‌ నివాసంలో కన్నాతోపాటు బీజేపీ ప్రతినిధులు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో తాము గమనించిన అంశాలతో కూడిన నివేదికను కేంద్ర మంత్రికి సమర్పించారు. పోలవరంపై గత ప్రభుత్వం, నేటి ప్రభుత్వం చూపిన అలసత్వంపై ఫిర్యాదు చేశారు. దాదాపు గంటసేపు ఈ భేటీ కొనసాగింది. 

అనంతరం మంత్రి షెకావత్‌ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే కేంద్ర ప్రభుత్వం చూస్తున్నట్లు చెప్పారు. రివర్స్‌ టెండర్ల పేరుతో పనులు నిలిపివేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని హెచ్చరించారు. ప్రాజెక్టును రాజకీయ కోణంలో చూడరాదని హితవు చెప్పారు. మోదీ ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచే ఎక్కడా అవినీతికి చోటు లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. 

ఈ సమావేశం అనంతరం కన్నా విలేకరులతో మాట్లాడుతూ  ప్రస్తుత ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలన్న ఉద్దేశంలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కేవలం పర్యాటక ప్రాంతంగా చూసిందని, త్వరగా పూర్తిచేయాలనుకోలేదని విమర్శించారు. అయితే ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలన్నదే ప్రధాని మోదీ ఆకాంక్ష అని పేర్కొన్నారు. 

టీడీపీ, వైసీపీ రెండూ పోలవరం ప్రాజెక్టును రాజకీయకోణంలోనే చూస్తున్నాయని విమర్శించారు. దొందూ దొందేనని వ్యాఖ్యానించారు. గతంలో కేంద్ర ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎలా కడుతుందంటూ టీడీపీ ప్రభుత్వాన్ని జగన్‌ ప్రశ్నించారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్‌ ఈ ప్రాజెక్టు విషయంలో తన విధానమేంటో స్పష్టం చేయాలని కన్నా డిమాండ్‌ చేశారు. 

పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో కాకుండా విజయవాడలోగానీ, కొవ్వూరులోగాని ఏర్పాటు చేయాలని మంత్రి షెకావత్‌ను కోరినట్లు కన్నా తెలిపారు. మంత్రితో జరిగిన భేటీలో కన్నాతోపాటు ఎంపీలు సుజనాచౌదరి, జీవీఎల్‌ నరసింహారావు, ఏపీ బీజేపీ ఇన్‌చార్జి సునీల్‌, మాజీ మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.