టీడీపీ, జనసేనలకు బీజేపీ ద్వారాలు బంద్

ఇక టీడీపీకి గానీ, జనసేనకు గానీ బీజేపీలోకి రావడానికి శాశ్వతంగా ద్వారాలు మూసుకు పోయాయని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్ వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పార్టీలకు బీజేపీతో సంబంధాలు ఉండవని రాజమహేంద్రవరంలో స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, ఆఖరికి వైసీపీ క్షేత్రస్థాయి కేడర్ సైతం బీజేపీలో చేరుతోందని చెప్పుకొచ్చారు. 

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేయనుందని ప్రకటించారు. దేశంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం కలిగిన బీజేపీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏపీలో చురుగ్గా సాగుతోందని చెబుతూ రానున్న 2020 జనవరి 31 నాటికి ఏపీలో 25 లక్షల సభ్యత్వం నమోదు చేయాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయమని, ఈ మేరకు ఇప్పటికే 8 లక్షల సభ్యత్వం నమోదయ్యిందని తెలిపారు. ప్రతీ కుటుంబం నుంచి బీజేపీ సభ్యత్వం ఉండటమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. 

ఏపీలో ఇప్పటికే 15 లక్షల బూత్ కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరిగిందని, త్వరలో మిగిలిన బూత్ కమిటీ ఎన్నికలు పూర్తి చేసుకుని, గ్రామ, మండల, జిల్లా, అనుబంధ కమిటీలు, రాష్ట్ర, అనంతరం జాతీయ స్థాయి కమిటీల నియామక ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. పెద్దఎత్తున బీజేపీలోకి మైనార్టీ, మహిళలు చేరుతున్నారని తెలిపారు.

ఆర్టికల్ 370 రద్దు పట్ల టీడీపీ, వైసీపీ మద్దతు ఇచ్చినంత మాత్రాన పార్టీలోకి చేరే అవకాశాలు ఉండవని పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలకు అభినందనలు తెలియచేశారు. బిజెపీ ఒక దేశం, ఒక జాతీయత అనే నినాదంతో ముందుకెళ్తోందని చెబుతూ ఏపీలో 8 లక్షల సభ్యత్వ నమోదు జరిగిన్నట్లు తెలిపారు. ఒక వ్యక్తి 25 మందిని చేర్పించడం ద్వారా క్రియాశీల సభ్యత్వం ఉంటుందని చెప్పారు.

 ఆన్‌లైన్ సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని చెబుతూ క్రియాశీల సభ్యుల నమోదు 12వేలకు పైగా జరిగిందని వెల్లడించారు. బూత్ కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదని స్పష్టం చేస్తూ ప్రధాని మోదీ, అమిత్‌షాలు ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కంకణబద్ధులై ఉన్నారని స్పష్టం చేశారు. ఏపీలో టీడీపీ నాయకత్వం లేని పార్టీ అని చెప్పారు.

బీజేపీ హిందూత్వం, అభివృద్ధి, జాతీయత కలిగిన పార్టీ అని, ఇవన్నీ ఏపీ ప్రజల్లో ఉన్నాయని, అందుకే బీజేపీ పట్ల మక్కువ ఉందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అన్ని రంగాల్లో విఫలమయ్యారని విమర్శిస్తూ వైసీపీ పరిస్థితిని బట్టి పెనం నుంచి పొయ్యిలో పడినట్టుగా ప్రజలు భావిస్తున్నారని ధ్వజమెత్తారు.