ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మాహుతి 

ఆర్టీసీ సమ్మె పట్ల కేసీఆర్ ప్రభుత్వ కక్షసాధింపు ధోరణి పట్ల మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన  డ్రైవర్‌ దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఖమ్మం డిపో డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మంలోని తన ఇంటి వద్ద కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం శనివారం రాత్రి హైదరాబాద్ మిధాని లోని డీఆర్డీవో అపోలో హాస్పిటల్ లో చేర్పించారు పోలీసులు. చికిత్స పొందుతూ ఈ ఉదయం శ్రీనివాస్ రెడ్డి చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. అంతకుముందే.. జిల్లా జడ్జి.. శ్రీనివాస్ రెడ్డి స్టేట్ మెంట్ రికార్డు చేసినట్టు జేఏసీ నాయకులు చెప్పారు.  

శ్రీనివాస్ రెడ్డి  మృతితో అపోలో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నిరసన తెలిపారు. హాస్పిటల్ లోకి వెళ్లేందుకు తమకు అనుమతివ్వాలంటూ నినాదాలుచేశారు. వారిని పోలీసులు అక్కడినుంచి బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి మరోచోటకు తరలించారు.  

శ్రీనివాస్ రెడ్డి మృతికి ప్రభుత్వానిదే బాధ్యత అని జేఏసీ నేతలు అన్నారు. 14న ఉమ్మడి ఖమ్మం జిల్లాబంద్ కు జేఏసీ పిలుపునిచ్చింది.  డ్రైవర్ మృతికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలోని డిపోల వద్ద కార్మికులు నిరసనకు దిగారు.  

ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు తెలం‍గాణ ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని బీజేపీ ఎంపీ అరవింద్‌ ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా జీహెచ్‌ఎంసీ యూనియన్‌ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సొంత కుటుంబం కోసం కేసీఆర్‌ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. 

కేసీఆర్‌ కుటుంబంలో డబ్బు వ్యామోహం బాగా పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియదని పరిస్థితి ఉందని.. కేసీఆర్‌ ప్రభుత్వం కూలిపోయినా బాధపడే వారెవరూ లేరని’ అరవింద్‌ వ్యాఖ్యానించారు. అహంకారపూరిత ధోరణి వలన నిజామాబాద్‌లో కేసీఆర్‌ కూతురు కవితకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని ఆయన నిప్పులు చెరిగారు.