పోలవరంలో అవినీతి జరిగితే బయటపెట్టండి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపించినపుడు విచారణ జరిపి దోషులను బయటపెట్టకుండా, రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం ఏమిటని  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తెలుగుదేశం, వైసీపీ క్విడ్‌ ప్రొ కో (నాకిది.. నీకిది) విధానాన్ని అనుసరించాయని ఆరోపించారు. తక్షణం విచారణ జరిపి, దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పోలవరం ప్రాజెక్టును శుక్రవారం బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు సందర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, భూసేకరణలో అక్రమాలు జరిగాయని బీజేపీ ఆరోపించిందని, అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇవే ఆరోపణలు చేసిందని గుర్తు చేశారు. అయితే తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, నాలుగు నెలలు గడుస్తున్నా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఎందుకు బయటపెట్టడంలేదని నిలదీశారు. 

 ‘టీడీపీ హయాంలో ప్రాజెక్టు పనుల్లో, భూసేకరణ, పునరావాస కల్పనలోను అవినీతి చోటు చేసుకుందని వైసీపీ విమర్శలు చేసింది. ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు గడచినా ఇప్పటి వరకు రుజువు చేయలేదు. అవినీతిపై ఎటువంటి చార్జిషీటును ఫైల్‌ చేయలేదు. అటువంటప్పుడు రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాల్సిన అవసరం ఏమిటి’ అని కన్నా ప్రశ్నించారు.  

ఆ సమయంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి, అవినీతిపరుల బాగోతం బయటపెడితే సరిపోతుందని, రివర్స్ టెండరింగ్ అవసరం ఏమిటని అడిగారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు తక్షణం ప్రారంభించి, రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని, రాజకీయాలకు పాల్పడతుండా నిర్మాణం పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. 

ఆదివారం (13న) కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌ను తామంతా కలిసి ప్రాజెక్టు పరిస్థితిపై నివేదిక ఇస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి ఇచ్చిన స్పష్టత మేరకే రాష్ట్రప్రభుత్వం ముందుకు వెళ్తుంది’ అని స్పష్టం చేశారు.   

గత ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీ పేరిట డబ్బు దుర్వినియోగం చేసిందని, దానిపై విచారణ జరిపి దోషులను బహిర్గతపర్చాలని ఎమ్మెల్సీ పి మాధవ్ డిమాండ్ చేశారు.  పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనులకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని, వారికి భూమికి భూమి ఇవ్వాలని కోరారు.  

నిర్వాసితులకు మెరుగైన పరిహారంతోపాటు మంచి ప్యాకేజీ అందించాలన్నారు. పునరావాసం, భూసేకరణలో అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరగాలని స్పష్టం చేశారు.  ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని కన్నా లక్ష్మీనారాయణతోపాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునిల్ దియోధర్, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ తదితరులు సందర్శించారు. నిర్మాణ ప్రాంతానికి చేరుకుని, స్పిల్‌వేను పరిశీలించారు.