13న పోలవరంపై కేంద్రమంత్రితో బిజెపి సమాలోచనలు 

ఈనెల 11న పోలవరం ప్రాజెక్టు యాత్ర చేపట్టి, అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో చర్చిస్తామని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆ తర్వాత, ఈనెల 13వ తేదీన కేంద్ర వనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను బీజేపీ రాష్ట్ర నేతలు కలిసి పోలవరం నిర్మాణం గురించి చర్చిస్తామని ప్రకటించారు. 

రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు పూరె్తైన నేపథ్యంలో పోలవరం నిర్మాణంపై వేచి చూశామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పోలవరంలో అవినీతి జరిగిందని చెబుతున్న ప్రస్తుత ప్రభుత్వం జర్మనీ పరికరాల స్థానంలో చైనా యంత్రాలను వినియోగిస్తున్నట్లు తెలిసిందని విస్మయం వ్యక్తం చేశారు. 

ప్రాజెక్టు నిర్మాణ వ్యయం తగ్గడం మంచిదేనని, అయితే నాణ్యత విషయంలో నూతన ప్రభుత్వం రాజీ పడకూడదని హెచ్చారించారు. తెలంగాణ నుండి రావాల్సిన బకాయిలపై ముఖ్యమంత్రి చొరవ చూపాలని సూచించారు. 

కాగా, జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఈనెల 15 నుండి 31వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రోజుకు 10 కిలోమీటర్ల చొప్పున 15 రోజులు 150 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ పాల్గొంటారని చెప్పారు. 

కేంద్రప్రభుత్వం ఏ ప్రాజెక్టు నిధులూ ఆపలేదని కన్నా స్పష్టం చేశారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద రూ.1800 కోట్లు విడుదల చేసినా రాష్ట్రప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదని విమర్శించారు. 2014 నుండి రాష్ట్భ్రావృద్ధికి ప్రధానమంత్రి మోదీ అన్ని విధాలా సహకరిస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధే దేశాభివృద్ధిగా భావిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు  

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లుందని, అందుకే అధికార వైసీపీ కార్యకర్తలకు జోరుగా పందేరాలు చేస్తున్నారని  కన్నా  వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉద్యోగాలను భర్తీ చేసి, వాటన్నింటినీ వైసీపీ కార్యకర్తలకే ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఛాయలు ఏ మాత్రం కనిపించటం లేదని చురకలు వేశారు. అందుకే ప్రభుత్వం నూతన పథకాలను అమలు చేయడంతో పాటు పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలను కల్పిస్తోందని విమర్శించారు.