ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 68వ జన్మదినం సందర్భంగా ఇవాళ ఉదయం నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. ట్విటర్ వేదికగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు దీర్ఘాయువుతో వర్థిల్లాలనీ, ఇంకా అనేక సంవత్సరాలు దేశ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను...’’ అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విటర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ మోదీని ఉద్దేశించి ‘‘మన ప్రధాని’’ అంటూ సంబోధించడం విశేషం. ‘‘మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను...’’ అని రాహుల్ ట్విట్ చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీ సైతం ప్రధాని మోదీకి శుభాకాంక్షలు చెబుతూ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టుచేసింది.

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ట్విటర్లో స్పందిస్తూ... ‘‘భారత విశిష్ట, శక్తిశీల ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని.. దేశాన్ని సమున్నత శిఖరాలవైపు నడిపించేలా ఆయన మరిన్ని సంవత్సరాలు సేవచేయాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రులు  యోగి ఆదిత్యనాథ్, తదితరులు కూడా ట్విటర్లో మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. కాగా మోదీ ఇవాళ తన పార్లమెంటు నియోజకవర్గం వారణాసిలో 68వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు.  

మోదీ 68వ పుట్టినరోజు సందర్భంగా 568 కిలోల లడ్డూని కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, ముక్తార్ అబ్బాస్ నఖ్వి ఆవిష్కరించారు. సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు మంత్రులు ఈ భారీ లడ్డూను ఆవిష్కరించారు. ఈ సంస్థ ప్రధాని మోదీ పుట్టినరోజును స్వచ్ఛతా దివస్‌గా నిర్వహిస్తున్నది.

తెలంగాణ రాష్ట్రం, ప్రజల తరపున ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్.. మోదీకి లేఖ పంపారు. దేవుడి దీవెనలతో ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని.. మరిన్ని సంవత్సరాలు దేశానికి సేవ చేయాలని ప్రార్థించినట్లు కేసీఆర్ పేర్కొన్నారు.

మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ నేతృత్వంలో సెప్టెంబర్ 17ను దేశవ్యాప్తంగా ‘సేవా దివస్’గా జరుపుకుంటున్నారు. రక్తదాన శిబిరాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు సహా బీజేపీ నేతలు ఇవాళ పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.