భారత్ లో 47శాతం మేర అంధత్వ నివారణ

అంధత్వ నివారణలో భారత్‌ మెరుగైన ఫలితాలను సాధిస్తున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లక్ష్యానికి చేరువైంది. 2007తో పోల్చితే దేశంలో అంధత్వం 47 శాతం మేర తగ్గిందని ప్రభుత్వ సర్వే వెల్లడించింది. 

2006-07లో అంధత్వంతో 1.20 కోట్ల మంది బాధపడగా.. ఈ సంఖ్య 2019 నాటికి 48 లక్షలకు తగ్గిందని తెలిపింది. 2020 నాటికి దేశ జనాభాలో అంధత్వాన్ని 0.3 శాతానికి తగ్గించాలన్న డబ్ల్యూహెచ్‌వో లక్ష్యానికి అతి చేరువగా ఉన్నామని పేర్కొంది. 2006-07లో దేశ జనాభాలో అంధత్వం 1 శాతం ఉండగా.. ప్రస్తుతం 0.36 శాతానికి తగ్గిందని, రానున్న రోజుల్లో డబ్ల్యూహెచ్‌వో లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపింది.

కంటిపై ఏర్పడే పొరల వల్ల అంధత్వానికి గురికావడం సాధారణంగా మారిందని, 66.2 శాతం మంది ఇలాంటి సమస్యతోనే అంధులుగా మారుతున్నారని ప్రభుత్వం తెలిపింది. అంతేగాక కార్నియా దెబ్బతినడం వల్ల 7.4శాతం మంది, కంటి శస్త్రచికిత్స సందర్భంగా సమస్యలు తలెత్తి 7.2 శాతం మంది కంటి చూపు కోల్పోతున్నారని వెల్లడించింది. 

దేశంలో అంధత్వంపై కేంద్ర ఆరోగ్య శాఖ సహకారంతో ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ సెంటర్‌ ఫర్‌ అప్తాల్మిక్‌ సైన్సెస్‌ సర్వే చేపట్టింది. 2015-18 మధ్య జరిగిన ఈ సర్వే నివేదికను కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ విడుదల చేశారు.