ఎన్నికల తర్వాత ఎన్‌సీపీ ఖాళీ.. పవార్ కు విశ్రాంతే!

ఈ నెల 21న జరుగనున్న మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో గెలుపుపై బీజేపీ ధీమాగా ఉంది. ఎన్నికల అనంతరం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) ఖాళీ అవుతుందని, ఆ పార్టీ అధినేత శరద్ పవార్‌కు రాజకీయ, సాంఘిక జీవితం నుంచి విశ్రాంతి కల్పిస్తామని బీజేపీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష కాంగ్రెస్-ఎన్‌సీపీ కూటమి ఓటమి తథ్యమని, అది తెలియడం వల్లే రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని  రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు. ఎన్‌సీపీ ఇప్పటికే 'సగం ఖాళీ' అయిందని, ఈనెల 24న ఫలితాలు వెల్లడైన తర్వాత పూర్తిగా ఆ పార్టీ ఖాళీ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు.  

'వాళ్లు (విపక్ష కూటమి) ఇప్పటికే ఓటమి తప్పదనే నిశ్చయానికి వచ్చేశారు. రాహుల్ గాంధీ బ్యాంకాక్ వెళ్లారనే వార్తలు చదవాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమి తప్పదని ఆయనకు బాగా తెలుసు. అలాంటప్పుడు ఓడిపోయామనే నింద ఆయన ఎందుకు పడాలి? అందుకే ఇక్కడి ప్రచారానికి రావడానికి ఆయన సిద్ధంగా లేరు' అని ఫడ్నవిస్ బుధవారంనాడు ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు.  

బీజేపీ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సహితం శాసన సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత శరద్ పవార్‌కు శాశ్వతంగా సాంఘిక, రాజకీయ జీవితాల నుంచి విరమణ కల్పిస్తామని ప్రకటించారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. ఆయన కాంగ్రెస్ నుంచి 1999లో బయటికొచ్చి, ఎన్‌సీపీని స్థాపించారు. 

మరోవంక, ప్రతిపక్ష మహాకూటమి ఎన్నికల మేనిఫెస్టోపై కూడా  ఫడ్నవిస్  ఛలోక్తులు విసిరారు. ఎలాగూ ఓడిపోతామని తెలిసి ప్రపంచంలో ఎక్కడా లేనన్ని హామీలు ఇచ్చుకుంటూ పోయిందన్నారు. మహారాష్ట్రలోని ప్రతి ఒక్కరికీ ఒక్కో తాజ్‌మహల్ కట్టిస్తామని చెప్పడం మినహా అన్ని హామీలు గుప్పించిందంటూ ఎద్దేవా చేశారు. 

తమ ప్రభుత్వం అతి పెద్ద రైతు రుణ మాఫీ పథకం ప్రవేశపెట్టిందని, ఇందువల్ల 50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. చిట్టచివరి రైతుకు కూడా రుణమాఫీ జరిగేంతవరకూ ఆ పథకం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రతీదీ మార్చేస్తామని తాము చెప్పడం లేదని, గత కాంగ్రెస్-ఎన్‌సీపీ హయాంలో కంటే మెరుగైన పనితీరు ప్రదర్శించామని మాత్రం కచ్చితంగా చెప్పగలమని ఫడ్నవిస్ పేర్కొన్నారు. 

ఇలా ఉండగా, ఎన్‌సీపీ కాంగ్రెస్ లో  విలీనమవుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని  శరద్ పవార్ తోసిపుచ్చారు. కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనం కాబోదని స్పష్టం చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ ఏకీకృతమవుతుందని చెప్తూ కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే ఎన్‌సీపీ కాంగ్రెస్‌లో విలీనమవుతుందనే సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్, ఎన్‌సీపీ వేర్వేరు పార్టీలు అయినప్పటికీ, సమీప భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు చేరువవుతాయన్నారు.