నోటీసుల డ్రామా ఆడుతున్న టిడిపి

తెలంగాణ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే టీడీపీ పార్టీ నోటీసుల డ్రామా ఆడుతోందని బిజెపి శాసనసభ పక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఐదు వందలతో పోయే కేసును పట్టుకొని ఎదో జరిగిపోయినట్లు టీడీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేసారు. ఇటువంటి ప్రచారం వలన ఎటువంటి సానుభూతి రాదని స్పష్టం చేసారు.

ఇదివరకు నోటీసులు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో అందుకున్నట్లు సమాచారం ఉందని బిజెపి నేత  తెలిపారు. అదే నోటీసులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డికి వస్తే మాత్రం కోర్టులపై గౌరవం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడేవారని ఎద్దేవ చేశారు. చంద్రబాబుకు కోర్టు నుంచి నోటీసులు వస్తే ప్రధాని నరేంద్ర మోదీ చేయించారనడం హాస్యాస్పదమని కొట్టిపారవేసారు.

హీరో శివాజీతో డ్రామా ఆడించింది టీడీపీ నాయకులేనని ద్వజమెత్తారు. ఈ డ్రామాలు ప్రజలకు తెలియదనుకోవడం వారి మూర్ఖత్వమని మండిపడ్డారు. అరెస్టు వారెంట్‌ విషయం వారం రోజుల ముందు శివాజీకి ఎలా తెలసని ప్రశ్నించారు. టీడీపీ ప్రజల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటూ వారి మాటలను నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరని స్పష్టం చేసారు. కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకోవడం చంద్రబాబుకు కొత్తేం కాదని విష్ణుకుమార్‌ రాజు ఎద్దేవ చేశారు.